
షార్జా: ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మళ్లీ నిరాశే ఎదురైంది. గత సీజన్ మాదిరే ఆ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌కే పరిమితమైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఆర్‌సీబీ ఓటమిపాలైంది. లోస్కోరింగ్ గేమ్‌లో ఆర్‌సీబీ ఆఖరి ఓవర్ వరకు పోరాడినా.. సునీల్ నరైన్(4/21, 26) ఆల్‌రౌండ్ షోతో మ్యాచ్‌ను లాగేసాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 రన్స్ చేసింది.
సునీల్ నరైన్(4/21) నాలుగు వికెట్లతో ఆర్‌సీబీ పతనాన్ని శాసించాడు. కేఎస్ భరత్(16 బంతుల్లో 9), విరాట్ కోహ్లీ(33 బంతుల్లో 39), ఏబీ డివిలియర్స్(9 బంతుల్లో 11), గ్లేన్ మ్యాక్స్‌వెల్(18 బంతుల్లో 15)ను పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీశాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్‌కతా 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 139 పరుగులు చేసి రెండు బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. సునీల్ నరైన్(15 బంతుల్లో 3 సిక్సర్లతో 26) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఆర్‌సీబీ బౌలర్లలో చాహల్, సిరాజ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు.
139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(18 బంతుల్లో 29), వెంకటేశ్ అయ్యర్(30 బంతుల్లో 26) శుభారంభం అందించారు. దూకుడుగా ఆడుతూ బౌండరీలు బాదారు. ముఖ్యంగా జార్జ్ గార్టన్ వేసిన ఐదో ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ వరుసగా మూడు బౌండరీలు బాదాడు. అయితే హర్షల్ పటేల్ వేసిన ఆరో ఓవర్ రెండో బంతికి శుభ్‌మన్ గిల్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 41 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి(6)ని చాహల్ ఎల్బీగా పెవిలియన్‌గా చేర్చాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. కోహ్లీ రివ్యూ ద్వారా ఫలితం సాధించాడు.
ఆ తర్వాత నితీశ్ రాణా ఓ సిక్స్, ఫోర్‌తో జోరు కనబర్చగా.. మరో ఎండ్‌లో వెంకటేశ్ అయ్యర్(26)ను హర్షల్ పటేల్ తన మరుసటి ఓవర్‌లో కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సునీల్ నరైన్ విశ్వరూపం చూపించాడు. డానియల్ క్రిస్టియన్ వేసిన ఓవర్‌లో మూడు భారీ సిక్సర్లు బాది మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆ తర్వాత నితీశ్ రాణాను చాహల్ ఔట్ చేయగా.. సునీల్ నరైన్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే ఓవర్‌లో దినేశ్ కార్తీక్ కూడా ఔటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కేకేఆర్ విజయానికి చివరి 12 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి వచ్చింది.
ఇక 19వ ఓవర్ వేసిన గార్టన్ 5 పరుగులే ఇవ్వడంతో ఆఖరి ఓవర్‌లో 7 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆర్‌సీబీ బౌలింగ్ ఆప్షన్స్‌లో డానియల్ క్రిస్టియన్ ఒక్కడే ఉండటంతో అతనికే బంతి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఫస్ట్ బాల్‌ను షకీబ్ బౌండరీ తరలించగా.. ఆ తర్వాత మూడు సింగిల్స్‌తో మ్యాచ్‌ను ముగించారు.