బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి మరో ఓటమి ఎదురైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఆర్‌సీబీ 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో కేకేఆర్ చేతిలో ఆర్‌సీబీ రెండోసారి ఓడిపోవడం గమనార్హం. చెత్త ఫీల్డింగ్‌తో పాటు పేలవ బ్యాటింగ్ ఆర్‌సీబీ ఓటమిని శాసించింది. ఐదు వరుస ఓటముల తర్వాత కేకేఆర్ విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. చివర్లో రింకూ సింగ్(18 నాటౌట్), డేవిడ్ వైస్(12 నాటౌట్) మెరుపులు మెరిపించారు. జాసన్ రాయ్(29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56), నితీశ్ రాణా(21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48) రాణించగా..రింకూ సింగ్(18 నాటౌట్), డేవిడ్ వైస్(12 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఆర్‌సీబీ బౌలర్లలో హసరంగా, విజయ్ కుమార్ రెండేసి వికెట్లు తీయగా.. సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. విరాట్ కోహ్లీ (37 బంతుల్లో 6 ఫోర్లతో 54), మహిపాల్ లోమ్రోర్(18 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 34) రాణించినా ఫలితం లేకపోయింది. కేకేఆర్ బౌలర్లలో సుయాశ్ శర్మ, ఆండ్రీ రస్సెల్ రెండేసి వికెట్లు తీయగా.. వరుణ చక్రవర్తీ మూడు వికెట్లు పడగొట్టాడు.
201 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీకి సరైన శుభారంభం దక్కలేదు. సుయాశ్ శర్మ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(17) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అతని మరుసటి ఓవర్‌లో షెహ్‌బాజ్ అహ్మద్(2) ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన డేంజరస్ మ్యాక్స్‌వెల్(5)ను వరుణ్ చక్రవర్తీ పెవిలియన్ చేర్చాడు. దాంతో ఆర్‌సీబీ పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయి 58 పరుగులు మాత్రమే చేసింది.

ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మహిపాల్ లోమ్రోర్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను సరిదిద్దే ప్రయత్నం చేశాడు. క్విక్ సింగిల్, డబుల్స్‌తో పాటు వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. మహిపాల్ లోమ్రోర్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు.
వరుణ్ చక్రవర్తీ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది మరుసటి బంతికి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 55 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే రస్సెల్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్ సూపర్ క్యాచ్‌కు విరాట్ కోహ్లీ కూడా వెనుదిరగడంతో ఆర్‌సీబీ పతనం మొదలైంది.
దినేశ్ కార్తీక్ కారణంగా.. సుయాశ్ ప్రభుదేశాయ్(10) మరోసారి రనౌటవ్వగా.. భారీ షాట్ ఆడే క్రమంలో హసరంగా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దినేశ్ కార్తీక్ సైతం చేతులు ఎత్తేయడంతో కేకేఆర్ విజయం లాంఛనమైంది. చివర్లో డేవిడ్ విల్లే, విజయ్ కుమార్ వైశాఖ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.