బెంగళూరు: టీమిండియా మాజీ కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తాత్కలిక సారథి విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ కోహ్లీకి అభిమానులున్నారు. ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నవారు కూడా కోహ్లీని ఆరాధ్య దైవంగా భావిస్తారు. అనేక సందర్భాల్లో కోహ్లీపై ఉన్న అభిమానాన్ని యువ ఆటగాళ్లు చాటుకున్నారు.
తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్ బిగ్ హిట్టర్ రింకూ సింగ్ కూడా కోహ్లీపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. విరాట్ కోహ్లీ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఆర్‌సీబీ-కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

మ్యాచ్ ముగిసిన తర్వాత డగౌట్‌కు వెళ్లే క్రమంలో రింకూ సింగ్.. విరాట్ కోహ్లీ పాదాలను టచ్ చేసి ఆశీర్వాదం తీసకున్నాడు. వెంటనే కోహ్లీ అతన్ని లేపి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
అయితే ఈ ఫొటో నిజమా? మార్ఫింగ్ అనేది తెలియడం లేదు. చాలా మంది నెటిజన్లు ఇది మార్ఫింగ్ ఫొటోనని కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ పాదాలను రింకూ సింగ్ తాకి ఉంటే ఆ వీడియో వైరల్ అయ్యేదని, ఇది పక్కా మార్ఫింగ్ అని వాదిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీపై 21 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. చివర్లో రింకూ సింగ్(18 నాటౌట్), డేవిడ్ వైస్(12 నాటౌట్) మెరుపులు మెరిపించారు. జాసన్ రాయ్(29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56), నితీశ్ రాణా(21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48) రాణించగా..రింకూ సింగ్(18 నాటౌట్), డేవిడ్ వైస్(12 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఆర్‌సీబీ బౌలర్లలో హసరంగా, విజయ్ కుమార్ రెండేసి వికెట్లు తీయగా.. సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. విరాట్ కోహ్లీ (37 బంతుల్లో 6 ఫోర్లతో 54), మహిపాల్ లోమ్రోర్(18 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 34) రాణించినా ఫలితం లేకపోయింది. కేకేఆర్ బౌలర్లలో సుయాశ్ శర్మ, ఆండ్రీ రస్సెల్ రెండేసి వికెట్లు తీయగా.. వరుణ చక్రవర్తీ మూడు వికెట్లు పడగొట్టాడు.