
షార్జా: నాకౌట్ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ వైఫల్యం కొనసాగుతోంది. లీగ్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో తడబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ నిర్ణయం మిస్ ఫైర్ అయ్యింది. కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్(4/21) నాలుగు వికెట్లతో ఆర్‌సీబీ పతనాన్ని శాసించాడు. కేఎస్ భరత్(16 బంతుల్లో 9), విరాట్ కోహ్లీ(33 బంతుల్లో 39), ఏబీ డివిలియర్స్(9 బంతుల్లో 11), గ్లేన్ మ్యాక్స్‌వెల్(18 బంతుల్లో 15)ను పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీశాడు. దాంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 రన్స్ చేసింది. కేకేఆర్ బౌలర్లలో నరైన్‌కు తోడుగా..లూకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు తీశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ శుభారంభం అందించారు. ధనాధన్ బ్యాటింగ్‌తో స్కోర్ బోర్డును పరుగెత్తించారు. షకీబ్ వేసిన తొలి ఓవర్‌లో బౌండరీ బాదిన కోహ్లీ.. శివం మావి మరుసటి ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. ఇక ఫెర్గూసన్ వేసిన నాలుగో ఓవర్‌లో పడిక్కల్ రెండు బౌండరీలు బాదడంతో ఆర్‌సీబీ 5 ఓవర్లలో 49 పరుగులు చేసింది. అయితే ఫెర్గూసన్ వేసిన ఆరో ఓవర్ తొలి బంతికి పడిక్కల్ క్లీన్ బౌల్డ్ కాగా.. ఆర్‌సీబీ పతనం మొదలైంది. ఆ ఓవర్‌లో నాలుగు పరుగులే రావడంతో పవర్ ప్లేలో ఆర్‌సీబీ వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. ఆ తర్వాత స్పిన్నర్లను బరిలోకి దించగా.. ఆర్‌సీబీ బ్యాట్స్‌మన్ తీవ్రంగా తడబడ్డారు.
గత మ్యాచ్‌లో దుమ్మురేపిన శ్రీకర్ భరత్ ఈ మ్యాచ్‌లో స్వేచ్చగా ఆడలేకపోయాడు. ఓవైపు వరుణ్.. మరో వైపు సునీల్ నరైన్.. మధ్యలో షకీబ్ కోహ్లీ-భరత్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. దాంతో ఈ ఇద్దరు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. చివరకు భరత్ భారీ షాట్‌కు ప్రయత్నించి నరైన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ రివర్స్ స్వీప్‌తో బౌండరీ రాబట్టాడు. కానీ ఆ తర్వాత మళ్లీ అదే తడబాటు కొనసాగింది. ఫెర్గూసన్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన కోహ్లీ.. నరైన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన ఏబీడీ బౌండరీతో జోరు చూపించాడు. కానీ నరైన్.. అతని క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో క్రీజులోకి వచ్చి షాబాజ్ తీవ్రంగా తడబడగా.. మరో ఎండ్‌లో మ్యాక్స్‌వెల్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన అతను భారీ షాట్ ఆడే ప్రయత్నంలో నరైన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. క్రీజులోకి ఫెర్గూసన్, హర్షల్ పటేల్ ఓ బౌండరీ బాదడంతో ఆర్‌సీబీ 138 పరుగులు చేయగలిగింది.