ఆర్‌సీబీ విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను వదిలినందుకు చాలా సిగ్గుపడ్డానని గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. చాలా అవమానకరంగా అనిపించిందని తెలిపాడు. ఆ క్షణమే బ్యాటింగ్‌లో చెలరేగి ఈ తప్పిదాన్ని సరి చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో బుధవారం బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. జోస్ బట్లర్(39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 73 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో గుజరాత్ టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన అతను.. ఫిల్ సాల్ట్ క్యాచ్ వదిలేయడం గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. 'నా బ్యాటింగ్‌ను ఆస్వాదించాను. మా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. నా కీపింగ్‌తో పాటు మా ఫీల్డింగ్ ఇంకాస్త మెరుగవ్వాలి. మేం ఫీల్డింగ్ సరిగ్గా చేసుంటే.. మా లక్ష్యం మరో 30 పరుగులు తక్కువగా ఉండేది. సాల్ట్ క్యాచ్ వదిలినందుకు సిగ్గుపడ్డాను. సాల్ట్ డేంజరస్ బ్యాటర్. అతని క్యాచ్ పట్టి హెర్షెల్ గిబ్స్ తరహాలో సంబరాలు చేసుకోవాలనుకున్నాను. కానీ కాస్త ముందుగానే సంబరాలు చేసుకోవడంతో బంతి చేజారింది. కొత్త బంతితో బౌలర్లకు కాస్త స్వింగ్ లభించింది. క్రెడిట్ మా ఓపెనర్లదే. ఆరంభంలో అద్భుతంగా ఆడారు. మా ఫీల్డింగ్ మెరుగవ్వాలి. కానీ మేం అన్ని విభాగాల్లో రాణించాం. మా జట్టులో అద్భుతమైన బౌలర్లతో పాటు నాణ్యమైన బ్యాటర్లు.. డేంజరస్ హిట్టర్స్ ఉన్నారు.'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. లియామ్ లివింగ్ స్టోన్(40 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. జితేష్ శర్మ(21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 33), టీమ్ డేవిడ్(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) దూకుడుగా ఆడారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీయగా.. సాయి కిషోర్(2/22) రెండు వికెట్లు పడగొట్టాడు. అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీసారు.
అనంతరం గుజరాత్ టైటాన్స్ 17.2 ఓవర్లలో 2 వికెట్లకు 170 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. జోస్ బట్లర్(39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 73 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సాయి సుదర్శన్(36 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 49)రాణించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హజెల్ వుడ్ తలో వికెట్ తీసారు.