
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ దుమ్మురేపుతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున గతేడాది దారుణంగా విఫలమైన వార్నర్.. తన పాత ప్రాంచైజీ ఢిల్లీ జెర్సీతో అదరగొడుతున్నాడు. ఆలస్యంగా లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వార్నర్.. వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాదాడు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో శనివారం జరిగిన మ్యాచ్‌లో వార్నర్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. 38 బంతుల్లో 66 పరుగులతో మంచి శుభారంభాన్ని అందించాడు. అయితే ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో వానిందు హసరంగా అతని జోరుకు బ్రేక్ వేసాడు.
ఆ ఓవర్‌లో అతను వేసిన ఫ్లైటెడ్ డెలివరీని వార్నర్ స్విచ్ హిట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్‌ను మిస్సయి ప్యాడ్లకు తాకింది. దాంతో ఆర్‌సీబీ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌటిచ్చాడు. రివ్యూ తీసుకున్న ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ ఫలితం రాబట్టాడు. రిప్లేలో బంతి వికెట్లను హిట్ చేస్తున్నట్లు కనిపించింది. దాంతో వార్నర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌కు హాజరైన తన కూతుళ్లు తండ్రి ఔటవ్వడాన్ని జీర్ణించుకోలేక తల్లడిల్లారు. వారిని టీవీ కెమెరామెన్ చూపించడంతో వీడియో వైరల్‌గా మారింది. వార్నర్ సతీమణి క్యాండీస్ వార్నర్ కూడా దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. వాస్తవానికి వార్నర్ ఉన్నంత సేపు ఢిల్లీ స్కోర్ బోర్డు పరుగెత్తింది. వార్నర్ ఔటవ్వడంతో మ్యాచ్ ఆర్‌సీబీ వైపు మళ్లింది.
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 16 పరుగులతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' దినేశ్ కార్తీక్ (34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 66 నాటౌట్) తన సూపర్ ఫామ్‌ను కొనసాగించాడు. మ్యాక్స్‌వెల్ (34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) అర్ధ సెంచరీ సాధించగా, షహబాజ్ (21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 32 నాటౌట్) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 173 పరుగులు చేసి ఓడిపోయింది. వార్నర్ (38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు 66), రిషభ్ పంత్ (17 బంతుల్లో3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34) మెరిశారు. బెంగళూరు బౌలర్లు హేజల్‌వుడ్ (3/28), సిరాజ్ (2/31) రాణించారు.