
షార్జా: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌లో సత్తా చాటిన విరాట్.. ఆ తర్వాత ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టాడు. క్రీజులో పాతుకుపోయి ఆర్‌సీబీ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన చెన్నై స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను తన మైమరిపించే ఫీల్డింగ్ విన్యాసంతో పెవిలియన్ చేర్చాడు. అచ్చం చేప పిల్ల తరహాలో డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
157 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(26 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 38), ఫాఫ్ డుప్లెసిస్(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) మంచి శుభారంభం అందించారు. 71 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని విరాట్ కోహ్లీ సూపర్ క్యాచ్ సాయంతో యుజ్వేంద్ర చాహల్ విడదీసాడు. చాహల్ వేసిన 9వ ఓవర్‌లో బౌండరీతో జోరు కనబర్చిన రుతురాజ్.. ఆ మరుసటి బంతికి క్యాచ్ ఔటయ్యాడు. చహల్ వేసిన ఫ్లైట్ అండ్ టర్న్ బాల్‌ను రుతురాజ్ కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేయగా బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి గాల్లోకి లేసింది. ఇక బ్యాక్ వర్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ కళ్లు చెదిరే ఫార్వర్డ్ డైవ్‌తో బంతిని అద్భుతంగా అందుకున్నాడు. దాంతో రుతురాజ్ క్రీజును వీడే ప్రయత్నం చేయగా.. నాన్ స్ట్రైకర్ ఫాఫ్ డుప్లెసిస్ క్యాచ్‌పై సందేహం వ్యక్తం చేస్తూ అతన్ని ఆపాడు. ఇక అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఔటిచ్చి థర్డ్ అంపైర్ సమీక్ష కోరగా.. రిప్లేలో క్లీన్ క్యాచ్‌గా తేలింది. గ్లేన్ మ్యాక్స్‌వెల్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే ఫాప్ డుప్లెసిస్ కూడా ఔటయ్యాడు. దాంతో ఆర్‌సీబీ రేసులోకి వచ్చింది. కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మోయిన్ అలీ, అంబటి రాయుడు భారీ షాట్లు ఆడటంతో మళ్లీ మూమెంటమ్ చెన్నైకి మళ్లింది.