జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టాలకు కృంగిపోవద్దు. విజయాలకు పొంగిపోవద్దు. ఇందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ పేసర్ యశ్ దయాల్ క్రికెట్ ప్రయాణమే నిదర్శనం. గతేడాది ఇదే ఐపీఎల్‌లో చివరి ఓవర్‌లో 29 పరుగులను డిఫెండ్ చేయలేకపోయిన యశ్ దయాల్.. తాజా సీజన్‌లో సంచలన బౌలింగ్‌తో 17 పరుగులు డిఫెండ్ చేసి ఆర్‌సీబీని ప్లే ఆఫ్స్ చేర్చాడు.
ఏడాది కాలంలోనే యశ్ దయాల్ సక్సెస్ అందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్‌గా.. కేకేఆర్ సంచలన రింకూ సింగ్ ధాటికి వరుసగా 5 బంతుల్లో 5 సిక్స్‌లు సమర్పించుకొని నాడు జీరో అయిన యశ్ దయాల్.. తాజాగా ఆర్‌సీబీకి చిరస్మరణీయ విజయాన్ని అందించి హీరోగా మారాడు.

రింకూ సింగ్ ధాటికి గత సీజన్‌లో తీవ్ర మానసిక వేదనతో అనారోగ్యానికి గురైన యశ్ దయాల్.. ఆ సీజన్‌లో మళ్లీ బరిలోకి దిగలేదు. చివరకు గుజరాత్ టైటాన్స్‌ను కూడా అతన్ని వదిలేసింది. వేలంలో అనూహ్యంగా రూ. 5 కోట్ల భారీ ధరకు ఆర్‌సీబీ కొనుగోలు చేయడంతో అందరూ విమర్శలు గుప్పించారు. 5 సిక్స్‌లు సమర్పించుకున్న బౌలర్‌కు రూ. 5 కోట్లా? అని సెటైర్లు పేల్చారు.
వారి విమర్శలకు తగ్గట్లే యశ్ దయాల్ ఫస్టాప్ సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. కానీ సెకండాఫ్ సీజన్‌లో సంచలన ప్రదర్శనతో ఆర్‌సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆ జట్టుకు ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమవ్వగా.. బంతిని అందుకున్న యశ్ దయాల్.. తొలి బంతినే లో ఫుల్‌టాస్ సంధించాడు.
ఈ లడ్డూ లాంటి బంతిని ధోనీ ఫైన్ లెగ్ దిశగా స్టేడియం బయటకు పంపించాడు. అతని భారీ సిక్సర్‌కు బంతి 110 మీటర్ల దూరంలో పడింది. దాంతో ఆర్‌సీబీ శిభిరం తీవ్ర నిరాశకు గురైంది. విరాట్ కోహ్లీ తీవ్ర ఆగ్రహానికి గురైంది.
తర్వాతి బంతిని నెమ్మదిగా వేసిన యశ్ దయాల్ డేంజరస్ ధోనీని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. తర్వాతి నాలుగు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి ఆర్‌సీబీని ప్లే ఆఫ్స్ చేర్చాడు. ఈ సంచలన ప్రదర్శనతో యశ్ దయాల్ ప్రస్తుతం హీరోగా మారాడు. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. యశ్ దయాల్ సంచలన ప్రదర్శనపై స్పందించిన రింకూ సింగ్.. 'ఇదంతా ఆ దేవుడి ప్లాన్ బేబీ'అని అభినందనలు తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
అభిమానులు.. అప్పటి, ఇప్పటి వీడియోలను షేర్ చేస్తూ యశ్ దయాల్‌ను కొనియాడుతున్నారు. తనకు దక్కిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ను ఫాఫ్ డుప్లెసిస్.. యశ్ దయాల్‌కు ఇచ్చేసాడు.