బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి మరో ఓటమి ఎదురైంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం జరిగిన హై స్కోరింగ్ గేమ్‌లో 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గ్లేన్ మ్యాక్స్‌వెల్(36 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76), ఫాఫ్ డుప్లెసిస్(33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో విజయానికి చేరువగా వచ్చిన ఆర్‌సీబీ.. వరుసగా వికెట్లు కోల్పోయి చేజేతులా గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలైంది.
దేశ్‌పాండే తీన్మార్..:ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు భారీ స్కోర్ చేసింది. డేవాన్ కాన్వే(45 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 83), శివమ్ దూబే(27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. అజింక్యా రహానే(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) విలువైన పరుగులు చేశాడు. ఆర్‌సీబీ బౌలర్లలో వ్యాన్ పార్నెల్, విజయ్ కుమార్ వైశాక్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్, సిరాజ్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 218 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లు తీయగా.. మతీష పతీరణ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ సింగ్, మహీష్ తీక్షణ, మొయిన్ అలీ తలో వికెట్ తీసారు.
శుభారంభం లేదు..:భారీ లక్ష్యచేధనలో ఆర్‌సీబీకి శుభారంభం దక్కలేదు. ఆకాశ్ సింగ్ వేసిన తొలి ఓవర్‌లోనే విరాట్ కోహ్లీ(6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన మహిపాల్ లోమ్రోర్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను తీక్షణ చేజార్చాడు. తుషార్ దేశ్‌పాండే వేసిన మరుసటి ఓవర్‌లో ఫాఫ్ డుప్లెసిస్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ ధోనీ నేలపాలు చేశాడు. ఈ ఓవర్ చివరి బంతికి లోమ్రోర్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్‌తో కలిసి డుప్లెసిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దాంతో పవర్ ప్లేలో ఆర్‌సీబీ 2 వికెట్లకు 75 పరుగులు చేసింది.
చుక్కలు చూపించిన ఫాఫ్, మ్యాక్సీ:పవర్ ప్లే అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించింది. భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో 9 ఓవర్లలోనే ఆర్‌సీబీ 105 పరుగులు చేసింది. ఈ క్రమంలో 23 బంతుల్లో ఫాఫ్ డుప్లెసిస్, 24 బంతుల్లో మ్యాక్సీ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ప్రతీ ఓవర్‌లో భారీ సిక్సర్లు బాదిన ఈ జోడీని తీక్షణ విడదీసాడు. గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చడంతో మూడో వికెట్‌కు నమోదైన 126 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
మలుపు తిప్పిన దేశ్‌పాండే..:ఆ కొద్ది సేపటికే ఫాఫ్ డుప్లెసిస్ కూడా అదే రీతిలో క్యాచ్ ఔటవ్వడంతో మ్యాచ్ చెన్నై వైపు మళ్లింది. కానీ షెహ్‌బాజ్ అహ్మద్(12)తో కలిసి దినేశ్ కార్తీక్(28) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో ఆర్‌సీబీ విజయం దిశగా దూసుకెళ్లింది. కానీ దినేశ్ కార్తీక్‌ను దేశ్‌పాండే.. షెహ్‌బాజ్‌ను పతీరణ ఔట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. క్రీజులోకి ఇంపాక్ట్ ప్లేయర్‌గా సుయాష్ ప్రభుదేశాయ్ రాగా.. ఆర్‌సీబీ విజయానికి 12 బంతుల్లో 31 పరుగులు అవసరమయ్యాయి.
కానీ 19వ ఓవర్‌లో పార్నెల్ ఔటవ్వగా.. ప్రభుదేశాయ్ భారీ సిక్సర్‌తో 12 పరుగులు రాబట్టాడు. దాంతో ఆఖరి ఓవర్‌లో ఆర్‌సీబీ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. ఓ సిక్సర్‌తో ప్రభుదేశాయ్ పోరాడినా ఫలితం లేకపోయింది.