
షార్జా: కెప్టెన్ విరాట్ కోహ్లీ(41 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో 53), దేవదత్ పడిక్కల్(50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీలతో రాణించారు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రత్యర్థి ముందు 157 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. కోహ్లీ, పడిక్కల్ శుభారంభాన్ని ఇతర బ్యాట్స్‌మన్ అందిపుచ్చుకోలేకపోయారు.
విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్(11 బంతుల్లో ఓ సిక్స్‌తో 12) దారుణంగా విఫలమవ్వగా.. అరంగేట్ర ప్లేయర్, హిట్టర్ టీమ్ డేవిడ్(3 బంతుల్లో 1) తీవ్రంగా నిరాశపరిచాడు. భారీ స్కోర్ అందిస్తాడనుకున్న మ్యాడ్ మ్యాక్సీ(9 బంతుల్లో 11) సైతం చేతులెత్తేసాడు. బ్రావో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో హసరంగా(1 నాటౌట్), హర్షల్ పటేల్(3) సైతం ఏం చేయలేకపోయారు. దాంతో సునాయసంగా 200 పరుగులు చేస్తుందనుకున్న ఆర్‌సీబీ సాధారణ స్కోర్‌కే పరిమితమైంది. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో మూడు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్‌కు ఓ వికెట్ దక్కింది. మరోసారి వికెట్ల వెనుకాల మహేంద్రుడు మాయాజాలం చూపించి ఆర్‌సీబీని తక్కువ స్కోర్‌కే పరిమితం చేశాడు.
దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి రెండు బంతులను బౌండరీలకు తరలించిన కోహ్లీ మంచి జోరు మీద కనిపించాడు. మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ సైతం అతనికి అండగా చెలరేగడంతో ఆర్‌సీబీ స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఇద్దరు పోటాపోటీగా బౌండరీలు బాదారు. ఈ జోడీ ఓవర్‌కు కనీసం ఒక బౌండరీ బాదడంతో పవర్ ప్లే ముగిసేసరికి ఆర్‌సీబీ.. వికెట్ నష్టపోకుండా 55 రన్స్ చేసింది. ఆ తర్వాత కూడా ఈ జోడీ జోరు కొనసాగింది. వీరి దూకుడుతో 11.1 ఓవర్‌లో 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంది. అయితే 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చెన్నైపై ఆర్‌సీబీ తొలి వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం ఇదే తొలిసారి. ముందుగా పడిక్కల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. అనంతరం కోహ్లీ కూడా అర్థ శతకంతో ఫామ్ అందుకున్నాడు.
క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని డ్వేన్ బ్రావో విడదీశాడు. కోహ్లీ ఊరించే స్లో బంతిని వేసి బోల్తా కొట్టించాడు. బ్రావో బాల్‌కు టెంప్ట్ అయిన కోహ్లీ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద జడేజాకు చిక్కాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఏబీడీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. శార్దూల్ బౌలింగ్‌లో ఏబీడీతో పాటు పడిక్కల్ వరుస బంతుల్లో ఔటయ్యారు. ఇది ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌పై ప్రభావం చూపింది. చివర్లో బ్రావో మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సాధారణ స్కోర్‌కే పరిమితమైంది.