రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజయోత్సవ సంబరాలు విషాదంగా ముగిసాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట చోటు చేసుకున్న తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది అభిమానులు స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిలాసట జరిగింది. ఈ అనూహ్య ఘటనతో ఆర్‌సీబీ సంబరం చిన్నబోయింది.
ఈ దురదృష్టకర ఘటన నేపథ్యంలో విజయోత్సవ వేడుకలను ఉద్దేశించి గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. 11 ఏళ్ల క్రితమే విజయోత్సవ వేడుకలపై గంభీర్ హెచ్చరించాడు. ఇలాంటి విజయోత్సవ వేడుకలను నిర్వహించాల్సిన అవసరం లేదని, అలాంటి వేడుకల్లో తాను భాగమవ్వనని తెలిపాడు.

ఐపీఎల్ 2014 సీజన్‌లో గౌతమ్ గంభీర్ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా నిలిచింది. ఈ విజయాన్ని కేకేఆర్ సెలెబ్రేట్ చేసుకుంది. ఈడెన్ గార్డెన్స్‌లో విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. అయితే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఈడెన్ గార్డెన్స్‌కు తరలివచ్చారు. అభిమానులను కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకున్నా.. అభిమానులపై పోలీసులు లాఠి చార్జీ చేయడంపై గంభీర్ ఆవేదనకు గురయ్యాడు. ఈ ఘటనపై హిందూస్తాన్ టైమ్స్ దినపత్రికకు రాసిన కాలమ్‌లో విచారం వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో ఇలాంటి వేడుకల్లో పాల్గొనని పేర్కొన్నాడు.
'కేకేఆర్ సన్మాన కార్యక్రమంతో కోల్‌కతా ప్రజలకు కలిగిన అసౌకర్యం పట్ల నేను నిరాశ చెందాను. భారత క్రికెట్ అభిమానులు.. ఈ ఆటకు అత్యంత ముఖ్యమైన వాటాదారులు. కానీ వారిని సరిగ్గా ట్రీట్ చేయలేదు. అమాయకులపై లాఠీ ఛార్జ్ జరిగింది. దేవుడి దయతో కేకేఆర్ టీమ్ ఎన్నో ట్రోఫీలు గెలుస్తుంది. కానీ నేను మాత్రం ఇలాంటి సన్మాన కార్యక్రమాలతో పాటు విజయోత్సవ వేడుకల్లో పాల్గొనను'అని గంభీర్ తన కాలమ్‌లో ప్రస్తావించాడు. తాజాగా ఆర్‌సీబీ విజయోత్స వేడుకల్లో తొక్కిసలాట జరగడంతో గంభీర్‌కు సంబంధించిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. విజయోత్సవ వేడుకలను పూర్తిగా రద్దు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.