రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజయోత్సవ సంబరాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట చోటు చేసుకున్న తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది అభిమానులు స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిలాసట జరిగింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులతో పాటు ఓ మహిళ ఉన్నారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అనూహ్య ఘటనతో ఆర్‌సీబీ సంబరం చిన్నబోయింది.
అయితే ఈ తొక్కిసలాట ఘటనే అవకాశంగా మార్చుకొందరు ఆకతాయిలు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఓ వైపు తొక్కిసలాటతో బాధితులు.. ఆర్తనాదాలు.. హాహాకారాలు చేస్తుంటే.. మరికొందరు రాక్షసంగా ప్రవర్తించారని, అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ 'స్వయంతృప్తి' పొందారని ఓ వ్యక్తి వీడియో విడుదల చేశాడు.

'నా స్నేహితుడి కజిన్ ఆర్‌సీబీ విక్టరీ పరేడ్ ఈవెంట్ కోసం వెళ్లింది. ఆమెను కొందరు లైంగికంగా వేధించారు. తన బట్టలు చించారు. దొరికిందే ఛాన్స్ అని ఎక్కడబడితే అక్కడ తాకుతూ రాక్షసంగా ప్రవర్తించారు' అని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇలా తయారు ఏంట్రా? అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం అమ్మాయిలు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నిస్తున్నారు.
35 వేల సీటింగ్ కెపాసిటీ కలిగిన చిన్నస్వామి స్టేడియానికి 3 లక్షల మంది అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియం గేట్ నంబర్ 7 వద్ద ఫ్రీ టికెట్లు ఇస్తున్నారనే వదంతి రావడంతోనే అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటలకు గేట్ నెంబర్ 3 తెరవడంతో భారీగా అభిమానులు దూసుకొచ్చారని, ఆ క్రమంలోనే కొందరు కింద పడిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అక్కడికి ఆంబులెన్స్ వచ్చేందుకు వీలు కాకపోవడం, వర్షం రావడంతో పరిస్థితి చేయి దాటిందన్నారు.