ఐపీఎల్ 2025 సీజన్‌లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) 18 ఏళ్ల తమ నిరీక్షణకు తెరదించింది. ఐపీఎల్ జట్లలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన టీమ్‌గా ఆర్‌సీబీ గుర్తింపు పొందింది. గత 18 ఏళ్లుగా ఆ జట్టు టైటిల్ గెలవకపోయినా.. అభిమానుల సంఖ్య తగ్గలేదు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ఆర్‌సీబీ క్రేజ్ చెక్కుచెదరలేదు. తాజాగా టైటిల్ కూడా గెలవడంతో ఆ జట్టు ఫ్యాన్ ఫాలోయింగ్ రెట్టింపు అయ్యింది. అయితే ఇంతటి ప్రజాదారణ ఉన్న ఈ ఫ్రాంచైజీని అమ్మేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్‌సీబీ ఫ్రాంచైజీని భారత బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా ప్రారంభించారు. ఆయన కంపెనీ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్.. 2012లో బ్యాంకులకు రుణం చెల్లించలేక మూతపడింది. దాంతో విజయ్ మాల్యా స్పిరిట్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడం ద్వారా.. డయాజియో ఆర్సీబీని స్వాధీనం చేసుకుంది.
ఆర్‌సీబీ జట్టును పూర్తిగా లేదా ఫ్రాంచైజీలోని కొంత భాగాన్ని విక్రయించేందుకు డయాజియో ప్రయత్నిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ అనే అమెరికా మీడియా సంస్థ పేర్కొంది. ఇప్పటికే డయాజియో కంపెనీ ఆర్థిక సలహాదారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. జట్టు విలువ సుమారు 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.16,834 కోట్లు) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఫ్రాంచైజీ విక్రయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆర్‌సీబీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ విషయంపై డయాజియా కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

18 ఏళ్ల తర్వాత ఆర్‌సీబీ తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయం ఫ్రాంచైజీ బ్రాండ్ వాల్యూను రెట్టింపు చేసింది. ఈ సమయంలో ఫ్రాంచైజీని విక్రయించడం ద్వారా డయాజియో గరిష్ట లాభాలను పొందాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్కహాల్, పొగాకు సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష ప్రకటనల ప్రచారాన్ని నిషేధించాలని, క్రికెటర్ల ద్వారా ఇతర అనారోగ్యకరమైన ఉత్పత్తుల ప్రమోషన్‌ను ఆపాలని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒత్తిడి చేస్తోంది. డయాజియో కంపెనీ ప్రధాన వ్యాపారం మద్యం. ప్రభుత్వ నియంత్రణలు వారి వ్యాపారానికి అడ్డంకిగా మారనున్నాయి. ప్రస్తుతం డయాజియో సోడా వంటి నాన్-ఆల్కహాలిక్ బ్రాండ్ ఎక్స్‌టెన్షన్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నప్పటికీ, భవిష్యత్తులో ఈ ప్రకటనలను కూడా నిషేధించే అవకాశం ఉంది.
డయాజియోకు అమెరికా అతిపెద్ద మార్కెట్. అయితే అక్కడ సుంకాలు పెరగడం, వినియోగదారుల తగ్గడంతో ప్రీమియం మద్యం అమ్మకాలపై ప్రభావం పడింది. దాంతో ఆ సంస్థ..ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే ఆర్‌సీబీ ఫ్రాంచైజీని అమ్మడం ద్వారా వచ్చే డబ్బులను ప్రధాన వ్యాపారంపై పెట్టాలనే యోచనలో డయాజియో ఉన్నట్లు తెలుస్తోంది. విజయోత్స వేడుకల్లో 11 మంది మరణించడంతో ఆర్‌సీబీ ఫ్రాంచైజీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన డయాజియో కంపెనీపై అదనపు ఒత్తిడి తీసుకొచ్చిందనే అభిప్రాయం కలుగుతుంది.