భారత్-పాకిస్థాన్ యుద్దం నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌ను వారం పాటు వాయిదా వేసారు. ఆటగాళ్ల ఆందోళనలు, ప్రసారకర్తలు, స్పాన్సర్‌లు, అభిమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు.
వారం రోజుల తర్వాత పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి తదుపరి షెడ్యూల్, మ్యాచ్‌ల వివరాలను వెల్లడిస్తామని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. భారత సాయుధ దళాల బలంపై బీసీసీఐకి పూర్తి విశ్వాసం ఉన్నప్పటికీ, ఐపీఎల్ వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. దేశం కంటే క్రికెట్ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. ఈ సీజన్‌లో ఇంకా 12 లీగ్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్‌తో సహా నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఆడించాల్సి ఉంది. సజావుగా సాగుతున్న టోర్నీ.. అనూహ్య పరిస్థితుల్లో వాయిదా పడింది.

ఈ టోర్నీ ఆగిపోయే సమయానికి పాయింట్స్ టేబుల్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టాప్-4లో కొనసాగుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ తర్వాతి రెండు స్థానాల్లో ఉండగా.. లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ చివరి స్థానాల్లో వరుసగా కొనసాగుతున్నాయి. సన్‌రైజర్స్, సీఎస్‌కే, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ నుంచి అధికారికంగా నిష్క్రమించగా.. కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ అదృష్టాన్ని నమ్ముకున్నాయి. ప్లే ఆఫ్స్ బెర్త్‌ల కోసం టాప్-5 టీమ్స్ మధ్య రసవత్తరపోరు కొనసాగుతోంది.
ఈ సీజన్‌లో ఆర్‌సీబీ అసాధారణ ప్రదర్శన కనబర్చింది. ఎన్నడూ లేని విధంగా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఆటను చూసి ఈ సారి ఆర్‌సీబీ టైటిల్ గెలవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అనూహ్య పరిస్థితుల్లో టోర్నీ వాయిదా పడటంతో ఆర్‌సీబీ మూమెంటమ్‌కు బ్రేక్ పడుతుందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఆర్‌సీబీ మెరుగైన ప్రదర్శన చేసినందుకే వాయిదా పడిందని సెటైర్లు పేల్చుతున్నారు. మరికొందరు మాత్రం పాపం.. ఆర్‌సీబీ అని కామెంట్ చేస్తున్నారు.