ఐపీఎల్ 2025 విజయోత్సవ వేడుకల్లో మరణించిన తమ అభిమానుల కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక అసోసియేషన్(కేఎస్‌సీఏ) సహకారంతో చనిపోయిన అభిమానుల పేర్ల మీదుగా చిన్నస్వామి స్టేడియంలో శాశ్వత సీట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆర్‌సీబీ.. చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద 11 మంది అభిమానుల మృతుల జ్ఞాపకార్థం ఒక స్మారక ఫలకాన్ని ఆవిష్కరించనున్నారు.
అంతేకాకుండా స్టేడియంలోని 11 సీట్లను శాశ్వతంగా వారి పేరు మీద రిజర్వ్ చేసి.. ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచాలని నిర్ణయించారు. భవిష్యత్తులో ఇక్కడ జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లు సహా అన్ని ఈవెంట్లలో ఈ సీట్లు ఖాళీగానే ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. 11 మంది అభిమానుల జ్ఞాపకార్థం 11వ నెంబర్ ప్రాక్టీస్ జెర్సీలను ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ ధరించనున్నారు. ఈ విషయాన్ని ఆర్‌సీబీ సీఈఓ రాజేష్ మీనన్ మంగళవారం మీడియాకు తెలిపారు.

' మ్యాచ్ రోజున ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్లందరూ 11వ నంబర్ జెర్సీని ధరిస్తారు. ఇది మా ప్రయాణంలో మాతోనే నడిచిన మా అభిమానులకు మేము అర్పించే నివాళి. మ్యాచ్ రోజు ఆటగాళ్లంతా నల్లని కళ్లద్దాలను కూడా ధరిస్తారు. అలాగే చిన్నస్వామి స్టేడియంలో 11 సీట్లను శాశ్వతంగా కేటాయించాలని మేము భావిస్తున్నాం. ఎప్పటికీ మాకు తోడుగా నిలిచే ఆ 11 మంది అభిమానుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం'అని రాజేష్ మీనన్ పేర్కొన్నారు.
ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆర్‌సీబీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల నిరీక్షణ ఫలించడంతో దేశవ్యాప్తంగా ఆర్‌సీబీ అభిమానుల ఆనందానికి హద్దేలేకుండా పోయింది. అయితే జూన్ 4న బెంగళూరులో ఆర్‌సీబీ నిర్వహించిన విజయోత్స వేడుక విషాదంగా ముగిసింది. ఈ విజయోత్స వేడుకలను చూసేందుకు అభిమానులు లక్షల్లో తరలిరావడంతో చిన్నస్వామి స్టేడియం బయట తొక్కిసలాట జరిగింది.
ఈ తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా.. 50 మంది వరకు గాయపడ్డారు. చనిపోయిన 11 మంది అభిమానుల్లో చిన్నారులతో పాటు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. విజయోత్సవ వేడుకల విషయంలో బీసీసీఐ కఠినమైన గైడ్‌లెన్స్ కూడా తీసుకొచ్చింది.
సరైన అనుమతులు తీసుకోకుండా విజయోత్సవ వేడుకలు నిర్వహించి, ప్రాణ నష్టానికి కారణమయ్యారని కర్ణాటక ప్రభుత్వం అప్పట్లో ఆర్‌సీబీ, కేఎస్‌సీఏలను బాధ్యుల్ని చేసింది. అనంతరం మృతుల కుటుంబాలకు ఆర్‌సీబీ ఫ్రాంచైజీ ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున నష్ట పరిహారాన్ని ప్రకటించింది. వారి కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఈ విషాదం తర్వాత చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా నిర్వహించకుండా స్టేడియంపై నిషేధం విధించారు. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం మ్యాచ్‌లు నిర్వహించుకునేందుకు పర్మీషన్ ఇచ్చింది. దాంతో ఈ సీజన్‌లో ఆర్‌సీబీ చిన్నస్వామి స్టేడియంలో 5 మ్యాచ్‌లు ఆడనుంది. తమ రెండో హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకున్న రాయ్‌పూర్‌లో మరో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి.