Mike Hesson: జట్టులో మార్పులు జరిగినా ఆటలో తేడా ఉండదు.. అదే జోరు కొనసాగుతోంది!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ కోసం జట్టులో మార్పులు జరిగినా ఆటలో మాత్రం తేడా ఉండదని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తాత్కలిక హెడ్ కోచ్ మైక్ హెస్సేన్ తెలిపాడు. ఎవరూ ఊహించని విధంగా ఆర్‌సీబీ హెడ్ కోచ్ సైమన్ కటిచ్.. తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. దాంతో ఆర్‌సీబీ ఫ్రాంచైజీ కొత్త కోచ్‌గా ఎవరిని నియమించకపోయినా.. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వ్యవహరిస్తున్న మైక్ హెస్సన్.. చీఫ్ కోచ్‌గానూ కొనసాగుతాడని తెలిపింది. ఇక హెడ్ కోచ్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్న మైక్ హెస్సెన్ టీమ్‌లో మార్పులపై ట్విటర్ వేదికగా స్పందించాడు.

అదే ఆట.. అదే జోష్..
యూఏఈలో పరిస్థితులను బట్టి తాము టీమ్‌లో మార్పులు చేశామని హెస్సన్ తెలిపాడు. 'చాలా రోజుల నుంచి మేం కప్ కోసం పోరాటం చేస్తున్నాం. టీమ్‌గా నిలకడను చూపిస్తున్నాం. ఇప్పుడు కూడా అదే కొనసాగించాలని కోరుకుంటున్నాం. అందుకే టీమ్‌లో మార్పులు చేశాం. వామిందు హసరంగా, టిమ్ డేవిడ్, దుష్మంత చమీరా సరైన టైమ్‌లో జట్టులోకి రాకపోయి ఉండొచ్చు. అయినప్పటికీ మా పెర్ఫామెన్స్‌లో ఏమాత్రం తేడా ఉండదు. ఈ ఏడాది ఆరంభంలో ఎలా ఆడామో యూఏఈలోనూ దానిని కొనసాగిస్తాం'అని హెస్సన్ పేర్కొన్నాడు. కోచ్‌గా సైమన్ కటిచ్ జట్టుకు అద్భుత సేవలను అందించాడని, అతని పాత్ర పోషించేందుకు తాను సిద్దంగా ఉన్నానని హెసెన్ తెలిపాడు.

ముగ్గురు నయా ప్లేయర్స్..
ఐపీఎల్ సెకండ్ ఫేజ్ కోసం ఆర్‌సీబీ ముగ్గురు కొత్త వారికి చోటు కల్పించి టీమ్‌ను మరింత బలోపేతం చేసుకుంది. ఇందులో భాగంగా లంక టాప్ స్పిన్నర్ వానిందు హసరంగ, పేసర్ దుష్మంత చమీరాతో పాటు బిగ్‌బాష్‌లో దుమ్మురేపిన సింగపూర్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌ను కొత్తగా టీమ్‌లోకి తీసుకుంది. ఆడమ్ జంపా, డానియల్ సామ్స్, ఫిన్ అలెన్ ప్లేస్‌లో ఈ ముగ్గుర్ని తీసుకున్నట్లు ఫ్రాంచైజీ శనివారం ప్రకటించింది. ఆర్‌సీబీలోని మిగతా ఇండియన్ ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, టీమ్ మేనేజ్‌మెంట్ శనివారం బెంగళూరుకు చేరుకున్నారు. ఏడు రోజుల క్వారంటైన్ తర్వాత ఈ నెల 29న యూఏఈ బయలుదేరుతారు. మిగతా ఇంటర్నేషనల్ ప్లేయర్లు 29 నుంచి అక్కడికి చేరుకుంటారు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ.. ఐదు టెస్ట్‌ల సిరీస్ అనంతరం నేరుగా జట్టుతో కలవనున్నాడు.

సింగపూర్ క్రికెటర్‌కు చాన్స్..
టిమ్ డేవిడ్‌ను ఆర్‌సీబీ తమ టీమ్‌లోకి తీసుకోవడంతో ఐపీఎల్‌లోకి తొలిసారి ఓ సింగపూర్ క్రికెటర్ వచ్చాడు. 6.5 అడుగుల పొడవు ఉండే టిమ్ డేవిడ్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే వరల్డ్ వైడ్‌గా జరిగే టీ20 లీగ్‌లకూ అతను ఫ్రీలాన్స్ క్రికెటర్‌గా అందుబాటులో ఉంటాడు. ఇప్పటివరకు ఆడిన14 టీ20ల్లో 158 స్ట్రయిక్ రేట్‌తో 558 రన్స్ చేశాడు. బీబీఎల్, పీఎస్‌ఎల్‌తో కలిసి మొత్తం 42 మ్యాచ్‌లు ఆడగా, 1171 రన్స్ ఖాతాలో వేసుకున్నాడు. భారీ సిక్సర్లు కొట్టడంలో డేవిడ్ దిట్ట. సీనియర్ లెవెల్లో ఇప్పటికే 77 సిక్స్‌లు బాదాడు. 25 ఏళ్ల డేవిడ్.. బీబీఎల్‌లో హోబర్ట్ హరికేన్స్, పెర్త్ స్కాచర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. డేవిడ్ తండ్రి రాడ్ డేవిడ్ కూడా సింగపూర్ మాజీ క్రికెటర్. సింగపూర్ పౌరసత్వం ఉన్న డేవిడ్ ఫ్యామిలీ.. పెర్త్‌లో (ఆస్ట్రేలియా) స్థిరపడింది.

గబ్బర్‌సేనను వణికించిన
ఇటీవల భారత బీ టీమ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో శ్రీలంక ఆటగాళ్లయిన వానిందు హసరంగా, చమీరా అద్బుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా చివరి టీ20లో స్పిన్ ఆల్‌రౌండర్ హసరంగా (4/9) 4 వికెట్లతో గబ్బర్ సేనను ఉక్కిరి బిక్కిరి చేశాడు. తన బర్త్ డే రోజే సూపర్ పెర్ఫామెన్స్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు. తొలి టీ20 రెండు, రెండో టీ20లో ఓ వికెట్‌తో మొత్తం ఏడు వికెట్లు తీశాడు. ఇక వన్డే సిరీస్‌లోనూ అద్భుతంగా రాణించాడు. ఫస్ట్ వన్డేలో విఫలమైనప్పటికీ.. రెండో వన్డేలో(3/37) మూడు, మూడో వన్డేలో (2/28) రెండు వికెట్లు తీశాడు. ఈ సిరీస్ అనంతరమే హసరంగాకు ఐపీఎల్‌లో అవకాశం దక్కడం ఖాయమని అంతా భావించారు. అంతా ఊహించినట్లే హసరంగాతో ఆర్‌సీబీ జట్టు ఒప్పందం కుదుర్చుకుంది. యూఏఈ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో ఈ వరల్డ్ నెంబర్ వన్ టీ20 బౌలర్ ఆర్‌సీబీ జట్టులో కీలకం కానున్నాడు. బ్యాటింగ్ సామర్థ్యం కూడా ఉండటంతో అతనికి జట్టులో చోటు దక్కడం ఖాయం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications