
రిటెన్షన్ రూల్స్ ప్రకారం..
బీసీసీఐ రూపొందించిన రిటెన్షన్ రూల్స్ ప్రకారం ఓ ఫ్రాంచైజీ గరిష్టంగా నలుగురి ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో ఇద్దరేసి భారత ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లును ఎంచుకోవచ్చు. లేదా ముగ్గురు భారత్, ఒక్కరు విదేశీ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. జీత భత్యాల్లో కూడా రూల్స్ పాటించాలి.
నలుగురిని రిటైన్ చేసుకుంటే తొలి ఆటగాడికి రూ.16 కోట్లు, రెండో ప్లేయర్‌కు రూ. 12 కోట్లు, మూడో ప్లేయర్‌కు రూ. 8 కోట్లు, నాలుగో ప్లేయర్‌కు రూ.6 కోట్లు చెల్లించాలి. ఈ లెక్కన ఫ్రాంచైజీలు రూ.90 కోట్ల తమ పర్స్ వాల్యూ నుంచి రూ.42 కోట్లు కోల్పోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) రిటైన్ చేసుకునే ఆటగాళ్లు ఎవరా? అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నెక్ట్స్ కెప్టెన్ ఎవరు?..
పైగా వచ్చే సీజన్ నుంచి తాను కేవలం ఆటగాడిగానే కొనసాగుతానని విరాట్ కోహ్లీ ప్రకటించడంతో తదుపరి కెప్టెన్ ఎవరా? అనేది అంతు చిక్కడం లేదు. అంతేకాకుండా సారథ్యం నుంచి తప్పుకున్నా.. ఆర్‌సీబీలో ఆటగాడిగా కొనసాగుతానని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. దాంతో అతన్ని రిటైన్ చేసుకోవడం ఖాయం. మిగతా ముగ్గరు ఎవరా? అనేదే ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ తేల్చకోవాలి.
విధ్వంసకర బ్యాట్స్‌మన్ గ్లేన్ మ్యాక్స్‌వెల్? లేక ఏబీ డివిలియర్స్‌ను తీసుకుంటుందా? చూడాలి. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే విరాట్ కోహ్లీతో పాటు ఏబీ డివిలియర్స్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, యుజ్వేంద్ర చాహల్‌ను రిటైన్ చేసుకునే చాన్స్ ఉంది. ఒక వేళ డిలియర్స్ అందుబాటులోకి రాకుంటే మాత్రం పడిక్కల్‌కు చోటు దక్కుతుంది.

మళ్లీ మ్యాక్స్‌వెల్..
తాజా రిటెన్షన్ పాలసీ ప్రకారం విరాట్ కోహ్లీ సాలరీలో కోటి రూపాయలు కోత పడనుంది. గతేడాది రూ.17 కోట్లు తీసుకున్న విరాట్.. ఈ సారి ఉన్న నిబంధనల ప్రకారం రూ.16 కోట్లే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ కోత పడే డబ్బులను ఫ్రాంచైజీలు సర్దుబాటు చేసే అవకాశం ఉంది. రెండో ప్లేయర్‌గా గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను తీసుకుంటే అతనికి రూ.12 కోట్లు దక్కుతాయి. అదే జరిగితే అతను రూ. 2.5 కోట్లు నష్టపోనున్నాడు.
2021 సీజన్ కోసం జరిగిన మినీ వేలంలో మ్యాక్సీని ఆర్‌సీబీ రూ. 14.5 కోట్లకు తీసుకుంది. ఆ డబ్బుకు అతను తగిన న్యాయం చేశాడు. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. కాబట్టి ఆర్‌సీబీ అతన్ని వదులుకునే సాహసం చేయకపోవచ్చు. పైగా అతను కెప్టెన్‌గా కూడా జట్టుకు పనికివస్తాడు.

ఏబీ డివిలియర్స్..
ఏబీ డివిలియర్స్‌ను మూడో ఆటగాడిగా తీసుకుంటే అతనికి రూ.8 కోట్లు చెల్లించాలి. అయితే అతనికి వచ్చే నష్టం ఏం ఉండదు. ప్రస్తుతం అతను అంతే జీతాన్ని అందుకుంటున్నాడు.
అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై చాలా రోజులు అవుతున్న నేపథ్యంలో ఏబీడీ వచ్చే సీజన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ అతను అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెబితే మాత్రం ఆర్‌సీబీ దేవదత్ పడిక్కల్‌ను తీసుకునే అవకాశం ఉంది. ఇక ఏబీడి ఆడితే అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించే చాన్సుంది. నాలుగో ప్లేయర్‌గా తమ ట్రంప్ కార్డ్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను తీసుకునే చాన్సుంది. మూడు ప్లేయర్‌గా తీసుకుంటే రూ.8 కోట్లు, నాలుగో ప్లేయర్‌గా అయితే నాలుగు కోట్లే దక్కనున్నాయి.


Click it and Unblock the Notifications
