
న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఐపీఎల్ 2021 సీజన్‌కు దూరమవుతున్నట్లు ఆ జట్టు, సౌతాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ ప్రకటించాడు. అయితే కాంపిటేటివ్ క్రికెట్ నుంచి తాను తప్పుకోవట్లేదని, కాస్త విరామం మాత్రమే తీసుకుంటున్నానని స్పష్టం చేశాడు.
'ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి అందుబాటులో ఉండట్లేదు. అలా అని ఇతర జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కాదు. కాస్త విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నా' అని స్టెయిన్ ట్వీట్ చేశాడు. అయితే ఐపీఎల్‌కు దూరమవుతున్నా ఇతర లీగ్‌ల్లో ఆడతానని స్టెయిన్ మరో ట్వీట్‌లో స్పష్టం చేశాడు. 'ఎంతో ప్రేమించే క్రికెట్‌ను కొనసాగించాలనుకుంటున్నా. ఆటకు వీడ్కోలు పలకట్లేదు'అని పేర్కొన్నాడు. ఇక, స్టెయిన్ ట్వీట్‌పై ఆర్‌సీబీ స్పందించింది. 'మమ్మల్ని మిస్ అవుతావ్ డేల్ స్టేయిన్. ఎన్నో జ్ఞాపకాలు అందించినందకు కృతజ్ఞతలు. మాకు మద్దతుగా ఉండు' అని ట్వీట్ చేసింది.
ఇక బంతుల్ని బుల్లెట్లా విసిరే స్టెయిన్ వచ్చే సీజన్‌కు దూరమవ్వడం ఆర్‌సీబీకి ప్రతికూలాంశమే. అయితే గత సీజన్‌లో స్టెయిన్ తీవ్రంగా నిరాశపరిచాడు. మూడు మ్యాచ్‌లు ఆడిన అతను భారీగా పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. కానీ అతని అనుభవం యువపేసర్లకు ఎంతో ఉపయోగపడింది. ప్రాక్టీస్ సెషన్లలో యువ బౌలర్లకు అతడు మార్గనిర్దేశం చేశాడు. ఐపీఎల్‌లో 95 మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్ 97 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఇప్పటివరకు కోహ్లీసేన టైటిల్‌ను ఒక్కసారి కూడా అందుకోని విషయం తెలిసిందే.