హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ తుది దశకు చేరుకుంది. మరో నాలుగు మ్యాచ్‌లతో లీగ్ దశకు తెరపడనుంది. టోర్నీ చివరి దశకు చేరినా ప్లే ఆఫ్స్ చేరే జట్లపై ఇంకా స్పష్టత రాలేదు. గుజరాత్ టైటాన్స్ మినహా మరో మూడు ప్లేస్‌ల కోసం 6 జట్లు పోటీపడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగ్గా ఉండగా..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సంచలన విజయాన్నందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అనూహ్యంగా రేసులోకి దూసుకొచ్చింది. కోహ్లీ శతక్కొట్టడంతో అసాధారణ విజయాన్నందుకున్న ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానంలో నిలిచింది.

ఆర్‌సీబీ భవితవ్యం గుజరాత్ టైటాన్స్ చేతిలో ఉంది. ఆదివారం బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
నేడు(శనివారం) ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ రెండు మ్యాచ్ ఫలితాల తర్వాత ప్లే ఆఫ్స్ బెర్త్‌లపై కాస్త క్లారిటీ రానుంది.ఢిల్లీ చేతిలో చెన్నై, కేకేఆర్ చేతిలో లక్నో ఓటమిపాలైతే.. ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్‌కు సువర్ణవకాశం దక్కినట్లే. గుజరాత్ టైటాన్స్‌పై ఆర్‌సీబీ గెలుపొందితే ప్లే ఆఫ్స్ చేరడం కాదు.. నేరుగా రెండో స్థానంలో నిలిచి క్వాలిఫయర్-1కు క్వాలిఫై అవుతుంది.
ఒకవేళ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆర్‌సీబీ ఓడితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడాలి. అంతేకాకుండా గుజరాత్ చేతిలో ఆర్‌సీబీ 5 పరుగుల కంటే ఎక్కువ తేడాతో ఓడిపోవద్దు. అలాకాకుండా 5 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడితే.. రాజస్థాన్ రాయల్స్‌కు అవకాశం దక్కుతుంది.
ఆర్‌సీబీ భవితవ్యం ఆ జట్టు చేతిలోనే ఉంది. హైదరాబాద్ గడ్డపై చెలరేగినట్లు సొంతగడ్డపై విజృంభిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. విజయం సాధించడంతో పాటు మెరుగైన రన్‌రేట్‌పై ఫోకస్ పెట్టాలి.