ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ చావోరేవో లాంటిదే. గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ రేసులో నిలవగా.. ఓడినా జట్టు ఇంటిదారి పడుతోంది.
ఈ క్రమంలోనే ఇరు జట్లు విజయమే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడిన ఆర్‌సీబీ అనంతరం అద్భుతంగా పుంజుకొని హ్యాట్రిక్ విజయాలు సాధించింది. అదే జోరులో చివరి మూడు మ్యాచ్‌లను గెలిచి ప్లే ఆఫ్స్ చేరాలనుకుంటోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ప్రయాణం పడుతూ లేస్తూసాగింది. చాలా మ్యాచ్‌ల్లో ఆ జట్టు విజయం ముంగిట చేతులెత్తేసింది. నిలకడలేమి ప్రదర్శన ఆ జట్టుకు సమస్యగా మారింది. ఈ క్రమంలోనే ధర్మశాల వేదికగా జరిగే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఆర్‌సీబీ దాదాపు విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. గ్లేన్ మ్యాక్స్ వెల్, విల్ జాక్స్, కామెరూన్ గ్రీన్, ఫాఫ్ డుప్లెసిస్ ఓవర్‌సీస్ ఆటగాళ్లుగా బరిలోకి దిగనున్నారు. అయితే గ్లేన్ మ్యాక్స్‌వెల్ పేలవ ఫామ్ ఆర్‌సీబీకి సమస్యగా మారింది. మానసిక అలసటను తీర్చుకునేందుకు కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండి రీ ఎంట్రీ ఇచ్చినా.. మ్యాక్స్‌వెల్ ఆటలో మార్పు లేదు. 8 ఇన్నింగ్స్‌ల్లో అతను 36 పరుగులు మాత్రమే చేశాడు.
ఈ క్రమంలోనే అతన్ని ఆడించాలా? లేదా? అనేదానిపై ఆర్‌సీబీ మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు ధర్మశాల పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉంటోంది. మ్యాక్సీకి బదులు లాకీ ఫెర్గూసన్, రీస్ టోప్లీలో ఒకర్ని తీసుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ ఏం చేస్తుందో చూడాలి. మిగతా కాంబినేషన్‌లో మాత్రం పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు.

ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ ఆడనుండగా.. విల్ జాక్స్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కర్ణ్ శర్మ ఆడనుండగా.. స్పిన్ ఆల్‌రౌండర్‌గా స్వప్నిల్ సింగ్ బరిలోకి దిగనున్నాడు. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్ కొనసాగనున్నారు. రజత్ పటీదార్, విజయ్ కుమార్ వైశాఖ్‌లను ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఆడించే ఛాన్స్ ఉంది.
ఆర్‌సీబీ తుది జట్టు(అంచనా)
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, విల్ జాక్స్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్, కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ వైశాఖ్