హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో సోమవారం లక్నో వేదికగా జరగనున్న మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో అనూహ్యంగా ఓడిన ఆర్‌సీబీ.. మళ్లీ విజయాల బాట పట్టడంపై ఫోకస్ పెట్టింది.
అంతేకాకుండా తొలి దశ పోటీల్లో లక్నో చేతిలో ఎదురైన థ్రిల్లింగ్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. బెంగళూరు వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. మరోవైపు ఐదు విజయాలతో టేబుల్ రన్నరప్‌గా కొనసాగుతున్న లక్నో సూపర్ జెయింట్స్.. ఆర్‌సీబీని ఓడించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలనుకుంటోంది. దాంతో ఈ మ్యాచ్ కూడా అభిమానులకు కావాల్సిన మజాను అందించనుంది.

కేకేఆర్‌తో గత మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో ఆర్‌సీబీ విఫలమైంది. కోహ్లీ, మహిపాల్ లోమ్రోర్ మినహా మరే బ్యాటర్ రాణించలేదు. ఇక గత మూడు మ్యాచ్‌ల్లో ఫాఫ్ డుప్లెసిస్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ మాత్రమే చేయగా.. కోహ్లీ జట్టును నడిపించాడు. పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడిన ఫాఫ్ పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. లక్నోతో జరిగే మ్యాచ్‌లో అతను కెప్టెన్‌గా పూర్తి స్థాయిలో జట్టుకు సేవలందించనున్నాడు.
తుది జట్టులో పెద్దగా మార్పులు చేయకపోయినా.. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హజెల్ వుడ్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. చీలమండ గాయంతో ఈ టోర్నీ ఫస్టాఫ్ మ్యాచ్‌లకు దూరమైన జోష్ హజెల్‌వుడ్ పూర్తిగా కోలుకోన్నాడు. కేకేఆర్‌తోనే అతను బరిలోకి దిగాల్సి ఉన్నా.. డేవిడ్ విల్లే అద్భుతంగా రాణించడంతో జట్టులోకి తీసుకోలేదు. అయితే కేకేఆర్‌తో బ్యాటింగ్ సందర్భంగా డేవిడ్ విల్లే పాదానికి గాయమైంది. దాంతో జోష్ హజెల్ వుడ్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ ఒక్క మార్పు మినహా జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశమే లేదు. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ బరిలోకి దిగనుండగా.. ఫస్ట్ డౌన్‌లో మహిపాల్ లోమ్రోర్ ఆడనున్నాడు. గత మ్యాచ్‌లో లోమ్రోర్ పర్వాలేదనిపించాడు. నాలుగో స్థానంలో గ్లేన్ మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్ చేయనుండగా.. ఐదో స్థానంలో షెహ్‌బాజ్ అహ్మద్ ఆడనున్నాడు. ఇప్పటి వరకు షెహ్‌బాజ్ మెరుగైన ప్రదర్శన చేయలేదు.
ఆరో స్థానంలో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఆడనుండగా.. ఏడో స్థానంలో సుయాశ్ ప్రభుదేశాయ్ ఆడే అవకాశం ఉంది. బౌలింగ్‌లో మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, విజయ్ కుమార్ వైశాఖ్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. వానిందు హసరంగా స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కొనసాగనున్నాడు. ఫాఫ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో సుయాశ్ ప్రభుదేశాయ్, కర్ణ్ శర్మలను పరిస్థితులకు తగ్గట్లు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకోనున్నారు.
లక్నోతో ఆర్‌సీబీ తుది జట్టు(అంచనా)
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, షెహ్‌బాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్(కీపర్), విజయ్ కుమార్ వైశాఖ్, వానిందు హసరంగా, జోష్ హజెల్‌వుడ్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్
ఇంపాక్ట్ ప్లేయర్: సుయాశ్ ప్రభుదేశాయ్/కర్ణ్ శర్మ