
ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ పేసర్, గేమ్ చేంజర్ హర్షల్ పటేల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఇటీవలే అతని సోదరి అర్చిత పటేల్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. దాంతో టీమ్ బయోబబుల్ వీడి ఇంటికి వెళ్లిన అతను చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడలేదు. ఇక సోదరి అంత్యక్రియలు పూర్తయిన అనంతరం మళ్లీ జట్టుతో కలిసి హర్షల్ పటేల్.. శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. సోదరి అకాల మరణంతో గుండెలో బాధ ఉన్నా బరిలోకి దిగి బౌలింగ్ చేశాడు. అయితే, గతరాత్రి తన సోదరిని గుర్తుచేసుకున్న హర్షల్ పటేల్.. ఆమె చెప్పిన మాటల వల్లే ఈ మ్యాచ్‌లో ఆడానని చెప్పాడు.
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన అక్కను తలుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. 'అక్కా.. నువ్వు మా జీవితాల్లో ఓ గొప్ప వ్యక్తివి. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొన్నావు. నేను నీతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు.. నా ఆటపై దృష్టి పెట్టాలని, నీ గురించి ఆలోచించవద్దని భారత్‌కు తిరిగి పంపిచేసావు. ఆ మాటల వల్లే నేను ఇప్పుడు మళ్లీ జట్టుతో కలిసి ఢిల్లీతో మ్యాచ్‌లో బరిలోకి దిగాను. ఇప్పుడు నీ కోసం ఇది మాత్రమే చేయగలిగాను. నువ్వు నా గురించి గర్వపడేలా చేసినవన్నీ ఎప్పటికీ అలాగే కొనసాగిస్తా. నా జీవితంలోని ప్రతిక్షణం నిన్ను మిస్ అవుతా.. నువ్వంటే నాకెంతో ఇష్టం. రెస్ట్ ఇన్ పీస్ జదీ' అని హర్షల్ ఎమోషనల్ పోస్టు చేశాడు.
గుజరాత్‌లోని సనంద్.. హర్షల్ పటేల్ స్వస్థలం కాగా.. అతని కుటుంబం అమెరికాలో స్థిరపడింది. తండ్రి విక్రమ్ పటేల్, తల్లి దర్శన పటేల్, చెల్లెలు అర్చిత పటేల్ అమెరికాలో ఉంటుండగా.. హర్షల్ పటేల్ ఒక్కడే ఇక్కడ ఉంటున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అర్చిత ఏప్రిల్ 9(శనివారం) కన్నుమూశారు.
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. నయా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలో మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతుండటం.. హర్షల్ పటేల్, హసరంగా బంతితో చెలరేగుతుండటంతో దూసుకెళ్తోంది. 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచిన ఆర్‌సీబీ.. పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది.