
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఇప్పటి వరకు ఒక్క టైటిల్ గెలవకపోయినా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) క్రేజ్ మాత్రం మాములగా లేదు. గతేడాది అత్యధిక ప్రజాదరణ పొందిన క్రికెట్ క్లబ్‌గా ఆర్‌సీబీ అరుదైన ఘనతను దక్కించుకుంది. ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, ఐపీఎల్ 2021 చాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ కంటే మోస్ట్ పాపులర్ టీమ్‌గా నిలిచింది. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో అత్యధిక ఇంటరాక్షన్ జరిగిన క్రికెట్ క్లబ్‌గా గుర్తింపు పొందింది.
గతేడాది ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అత్యధిక ఇంటరాక్షన్స్ జరిపిన స్పోర్ట్స్ క్లబ్స్ జాబితాలో ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ టాప్‌లో ఉండగా.. ఎఫ్‌సీ బార్సిలోనా, రియల్ మాడ్రిడ్, చెల్సీ ఎఫ్‌సీ, పారిస్ సెయింట్ జర్మన్ టాప్-5లో ఉన్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 821 మిలియన్స్ ఇంటరాక్షన్స్‌తో 6వ స్థానంలో ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ 719 మిలియన్ల ఇంటరాక్షన్స్‌తో 9వ స్థానంలో నిలిచింది. ఎంగేజ్‌మెంట్ విషయంలో మాంచెస్టర్ యునైటెడ్ 2.6 బిలియన్స్‌తో టాప్‌లో ఉండగా.. ఎఫ్‌సీ బార్సిలోనా, రియల్ మాడ్రిడ్, పారీస్ సెయింట్ జర్మన్, చెల్సీ, లివర్ పూర్, గలాటసరీ టాప్-7లో ఉన్నాయి. ఇక 820 మిలియన్ల ఎంగేజ్‌మెంట్స్‌తో ఆర్‌సీబీ 8వ స్థానంలో ఉండగా.. 752 మిలియన్ల ఎంగేజ్‌మెంట్‌తో చెన్నై సూపర్ కింగ్స్ 9వ స్థానంలో ఉంది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కారణంగా ఆర్‌సీబీకి ఇంత క్రేజ్ వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ధనాధన్ లీగ్‌లో ఆర్‌సీబీ వరుసగా విఫలమవుతున్నా.. అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరిన ఆ జట్టు.. టోర్నీలో ముందడుగు వేయలేకపోయింది. వచ్చే ఏడాది 10 జట్లతో లీగ్ జరగనున్న నేపథ్యంలో మెగా వేలం నిర్వహించనున్నారు. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగియగా.. ఆర్‌సీబీ విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహమ్మద్ సిరాజ్‌లను రిటైన్ చేసుకుంది. ఇక వచ్చే సీజన్ నుంచి తాను ఆటగాడిగానే కొనసాగుతానని విరాట్ కోహ్లీ ప్రకటించడంతో.. ఆ జట్టు కెప్టెన్‌ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.