రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) పవర్ హిట్టర్, ఇంగ్లండ్ వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్ వైఫల్యం కొనసాగుతోంది. భారత్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో ఈ ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20లో డకౌటైన ఫిల్ సాల్ట్.. చెన్నై వేదికగా జరిగిన రెండో టీ20లో 4 పరుగులు చేశాడు.
రాజ్‌కోట్ వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20లోనూ 5 పరుగులే చేసి ఔటయ్యాడు. ఈ మూడు ఇన్నింగ్స్‌ల్లో ఫిట్ సాల్ట్ 10 బంతులకు మించి ఆడలేకపోయాడు. పవర్ ప్లేలో భారత పేసర్లకు తడబడుతున్నాడు. తొలి రెండు టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో వెనుదిరిగిన ఫిల్ సాల్ట్.. మూడో టీ20లో హార్డిక్ పాండ్యా బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు.

రూ.11.50 కోట్లు బొక్కేనా..?
అతని దారుణ వైఫల్యం ఇంగ్లండ్ బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపి విజయవకాశాలను దెబ్బతీస్తోంది. ఫిల్ సాల్ట్ పేలవ ఫామ్ ఆర్‌సీబీ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఫిల్ సాల్ట్‌ను ఆర్‌సీబీ రూ. 11.50 కోట్ల భారీ దరకు కొనుగోలు చేసింది.
గత సీజన్‌లో కేకేఆర్ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చడంతో అతనిపై ఆర్‌సీబీ కోట్లు కుమ్మరించింది. కానీ అప్‌కమింగ్ సీజన్‌కు ముందు భారత గడ్డపై జరుగుతున్న టీ20 సిరీస్‌లో అతను వరుసగా విఫలమవుతుండటం అభిమానులకు కలవరపెడుతోంది. దాంతో రూ. 11.50 కోట్లు ఆర్‌సీబీ బొక్కేనా? అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
లివింగ్ స్టోన్ విధ్వంసం..
మరో విధ్వంసకర బ్యాటర్ లియామ్ లివింగ్ స్టోన్ మాత్రం ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. తొలి రెండు టీ20ల్లో 0, 13 విఫలమైనా.. కీలకమైన మూడో మ్యాచ్‌లో మాత్రం భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు దూకుడుగా ఆడుతూ 24 బంతుల్లో ఫోర్, 5 సిక్సర్లతో సాయంతో 43 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.
అతని బ్యాటింగ్ పట్ల ఆర్‌సీబీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లివింగ్ స్టోన్‌ను ఆర్‌సీబీ రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గ్లేన్ మ్యాక్స్‌వెల్‌కు ప్రత్యామ్నాయంగా ఆర్‌సీబీ.. లివింగ్ స్టోన్‌ను కొనుగోలు చేసింది. మరో ఇంగ్లండ్ బ్యాటర్ జాకోబ్ బెతెల్‌ను కూడా ఆర్‌సీబీ రూ. 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే తొలి టీ20లో అతను 7 పరుగులే చేయడంతో తుది జట్టు నుంచి తప్పించారు.