భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వారంపాటు వాయిదా పడిన ఐపీఎల్ 2025 సీజన్.. శనివారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఇరు దేశాల కాల్పుల విరమణకు ఒప్పందం కుదుర్చుకోవడంతో.. ఐపీఎల్ 2025 సీజన్ రివైజ్డ్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. శనివారం ఆర్‌సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ పున:ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆర్‌సీబీ అభిమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన క్రమంలోనే కేకేఆర్‌తో మ్యాచ్‌కు వైట్ జెర్సీలో హాజరవ్వాలని ఆర్‌సీబీ ఫ్యాన్స్ నిర్ణయించారు. తద్వారా విరాట్ కోహ్లీకి ఘన వీడ్కోలు పలకాలని భావిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఆర్‌సీబీ ఫ్యాన్స్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్‌లు నెట్టింట వైరల్‌గా మారాయి.

సోమవారం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 13 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో విరాట్ కోహ్లీ 123 మ్యాచ్‌లు ఆడి 9230 పరుగులు చేశాడు. 10 వేల పరుగులకు 770 రన్స్ దూరంలో నిలిచాడు. ఇందులో 30 సెంచరీలతో పాటు 7 డబుల్ సెంచరీలు ఉన్నాయి. 68 మ్యాచ్‌ల్లో టీమిండియాను నడిపించిన విరాట్ కోహ్లీ 40 విజయాలు అందించాడు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యధిక టెస్ట్ విజయాలు అందించిన బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు.