డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అభిమానులకు బ్యాడ్ న్యూస్. అప్‌కమింగ్ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ తమ హోమ్ మ్యాచ్‌లను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆడటం లేదు. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్ నారయణ్ సింగ్ స్టేడియంలో ఆర్‌సీబీ తమ హోమ్ మ్యాచ్‌లను ఆడనుంది. అయితే ఈ విషయాన్ని ఆర్‌సీబీ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
'ఆర్‌సీబీ తమ హోమ్ మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియంలో ఆడటం లేదు. ఐదు మ్యాచ్‌లను నవీ ముంబై, మరో ఐదు మ్యాచ్‌లను రాయ్‌పూర్ వేదికగా ఆడనుంది. ఆర్‌సీబీ అధికారులు ఇప్పటికే ఈ రెండు మైదానాల్లో ఏర్పాట్లు చేసేందుకు సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.'అని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగిన 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోవడంతో చిన్నస్వామి స్టేడియం సురక్షితం కాదని ఫ్రాంచైజీ భావిస్తోంది. చిన్నస్వామి స్టేడియం బయటే తొక్కిసలాట జరగ్గా 50 మంది గాయపడగా.. 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దురదృష్టకర ఘటనతో ఆర్‌సీబీ విజయోత్సవం కాస్త విషాదంగా మారింది.

ఆ ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియాన్ని కర్ణాటక ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లకు కూడా పర్మీషన్ ఇవ్వలేదు. దాంతో ఆ మ్యాచ్‌లను బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో నిర్వహించారు. ఐపీఎల్ చరిత్రలోనే ఆర్‌సీబీ తమ మ్యాచ్‌లను భారత్‌లోని తటస్థ వేదికలో ఆడటం ఇదే తొలిసారి కానుంది. ఈ న్యూస్ ఆర్‌సీబీ అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించనుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలిగిన జట్టుగా ఆర్‌సీబీ ఉంది. ఐపీఎల్ సందర్భంగా ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద వార్ నడుస్తది. అలాంటిది ఇప్పుడు ఆర్‌సీబీ మ్యాచ్‌లు ముంబై వేదికగా జరుగుతాయనే విషయాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ తమ హోమ్ మ్యాచ్‌లను పుణేకు తరలించినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌లో ఎన్నికలు నిర్వహించకపోతే ఐపీఎల్ వేదికను కోల్పోతారని ఐపీఎల్ ఛైర్మెన్ అరుణ్ ధుమాల్ హెచ్చరించారు. 'ఇప్పటికే రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌కు మేం ఈ విషయం చెప్పాం. ఎన్నికలు నిర్వహించకపోతే.. ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశాన్ని కోల్పోతారని హెచ్చరించాం.'అని ఐపీఎల్ మినీ వేలం సందర్భంగా అరుణ్ ధుమాల్ తెలిపాడు.