భారత పిచ్‌లపై పూర్తి అవగాహన ఉన్న ఆటగాడనే రజత్ పటీదార్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నూతన సారథిగా ఎంపిక చేశామని ఆ జట్టు డైరెక్టర్ మో బోబట్ తెలిపాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఓ ఆప్షన్‌గా ఉండటంతోనే ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్‌సీబీని రజత్ పటీదార్ నడిపిస్తాడని బుధవారం ఆ జట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
విరాట్ కోహ్లీ అనంతరం సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ ఆర్‌సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. గత మూడు సీజన్లలో అతనే జట్టును నడిపించాడు. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆర్‌సీబీ.. ఫాఫ్ డుప్లెసిస్‌ను రిటైన్ చేసుకోలేదు. వేలంలోనూ తిరిగి కొనుగోలు చేసే ప్రయత్నం చేయలేదు. దాంతో కొత్త సారథిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఆర్‌సీబీకి ఏర్పడింది. అయితే జట్టులోని సీనియర్ ఆటగాళ్లను కాదని ఆర్‌సీబీ.. రజత్ పటీదార్‌ను ఎంపిక చేసింది.

భారత ఆటగాడైతేనే..
అందుకు గల కారణాలను ఆ జట్టు డైరెక్టర్ మో బోబట్ తెలియజేశాడు. విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ అవసరం లేదని, లీడర్‌షిప్ గ్రూప్‌లో అతను ఓ మెంబర్ అని స్పష్టం చేశాడు. 'ఆర్‌సీబీ నూతన సారథిగా ఎవరిని నియమించాలనే విషయంపై తీవ్రంగా చర్చించాం. భారత్ క్రికెటర్ లేదా ఓవర్‌సీస్ ప్లేయర్ అనేది ప్రధానం అంశంగా మాట్లాడుకున్నాం. అయితే టీమిండియా ప్లేయర్ అయితేనే బాగుంటుందని రజత్ పటీదార్‌వైపు మొగ్గు చూపాం. అంతేకానీ, విదేశీ ఆటగాళ్లపై ఎలాంటి వ్యతిరేకత లేదు. భారత పిచ్‌లపై పూర్తి అవగాహన ఉన్న ఆటగాడైతే మంచిదని భావించాం.
కోహ్లీకి కెప్టెన్సీ అవసరం లేదు..
అందులో విరాట్ కోహ్లీ కూడా ఓ ఆప్షన్‌గా ఉన్నాడు. దాంతోనే ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాం. లేకపోతే అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తాయని మాకు తెలుసు. విరాట్ కోహ్లీకి ప్రత్యేకంగా కెప్టెన్సీ అవసరం లేదు. జట్టును నడిపించడంలో సీనియర్ ఆటగాడిగా ఎప్పుడూ బాధ్యత తీసుకుంటాడు. గతేడాది ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ.. జట్టుకు అవసరమైనప్పుడు కోహ్లీ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. మైదానంలోనూ రజత్ పటీదార్‌కు కోహ్లీ అండగా ఉంటాడు.'అని బోబట్ చెప్పుకొచ్చాడు.