'ఇంట గెలిచి రచ్చ గెలవు'అంటారు పెద్దలు. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) పరిస్థితి ఇందుకు విరుద్దంగా ఉంది. రచ్చ గెలుస్తున్న ఆర్‌సీబీ.. ఇంట్లో మాత్రం ఓడిపోతుంది. ఏ జట్టుకైనా సొంతమైదానంలో అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం మాత్రం ఆర్‌సీబీ కొంపముంచుతోంది. బయట స్టేడియాల్లో దుమ్మురేపుతున్న ఆర్‌సీబీ.. హోమ్ గ్రౌండ్‌లో మాత్రం తేలిపోతుంది. వరుసగా హోమ్ గ్రౌండ్‌లో మూడో పరాజాయాన్ని నమోదు చేసింది.
పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించగా.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 9 వికెట్లకు 95 పరుగులే చేసింది. అనంతరం పంజాబ్ కింగ్స్ 12.1 ఓవర్లలో 5 వికెట్లకు 98 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ప్రత్యర్థి జట్ల గ్రౌండ్లపై చెలరేగుతున్న ఆర్‌సీబీ బ్యాటర్లు చిన్నస్వామిలో మాత్రం తేలిపోతున్నారు. దాంతో ఈ సీజన్‌లో ఆర్‌సీబీ హోమ్ గ్రౌండ్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.

పంజాబ్‌తో పరాజయంతో ఆర్‌సీబీ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. సొంతగడ్డపై అత్యధిక మ్యాచ్‌లు ఓడిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్‌సీబీ ఇప్పటి వరకు 46 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ పేరిట ఉన్న రికార్డ్‌ను ఆర్‌సీబీ అధిగమించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తన హోమ్ గ్రౌండ్‌లో 45 మ్యాచ్‌ల్లో పరాజయంపాలైంది. ఏడు మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ 4 గెలిచి మూడు ఓడింది. ఈ మూడు కూడా హోమ్ గ్రౌండ్‌లోనే ఓడిపోవడం గమనార్హం.