విరాట్ కోహ్లీ భవితవ్యంపై ఆర్‌సీబీ కీలక ప్రకటన!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అభిమానులకు ఆ జట్టు సీఈఓ రాజేష్ మీనన్ గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్ 2030 వరకు విరాట్ కోహ్లీ ఆర్‌సీబీలోనే కొనసాగుతాడని స్పష్టం చేశాడు. ఆర్‌సీబీ ఫ్రాంచైజీకి విరాట్ కోహ్లీ గుండెకాయ అని, అతను లేకుండా ఆర్‌సీబీ ఫ్రాంచైజీని ఊహించలేమని చెప్పాడు. కనీసం అతను మరో 3-4 ఏళ్లు జట్టులో కొనసాగుతాడని అభిప్రాయపడ్డాడు.
మరో నాలుగేళ్ల పక్కా..
'ఆర్‌సీబీ, విరాట్ కోహ్లీ ఒకే నాణేనికి రెండు ముఖాల లాంటివారు. మొదటి నుంచి ఆర్‌సీబీకి విరాట్ కోహ్లీనే బలమైన శక్తిగా ఉంటూ వస్తున్నారు. కోహ్లీ కెరీర్ చివరిదశలో ఉన్నప్పటికీ.. ఆయన ఆర్‌సీబీలో భాగంగా కుండా ఉండటాన్ని మనం ఊహించలేం. కోహ్లీ కెరీర్ చివరి దశలో ఉన్నా మరో 3-4 ఏళ్ల పాటు ఆర్‌సీబీ తరఫున ఆయన ఆడుతారని నమ్ముతున్నా.

కనీసం మరో నాలుగేళ్లు అయినా ఆడుతారు. కోహ్లీ ఎంతో ఫిట్‌గా ఉన్నారు. ఆయనలో పరుగులు చేయాలనే ఆకలి ఎప్పటికీ చచ్చిపోదు. తాజా ఐపీఎల్ 2026 సీజన్‌లో కోహ్లీ చూపించిన శక్తి, చేసిన పరుగులు, చూపించిన అటిట్యూడ్ అమోఘం. రాబోయే 3-4 ఏళ్ల వరకు ఆయన ఐపీఎల్ ఆడటంలో ఎలాంటి సమస్యా లేదు.'అని రాజేష్ మీనన్ చెప్పుకొచ్చారు.
గత 19 సీజన్లుగా..
అరంగేట్ర ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీలోకి అడుగు పెట్టిన విరాట్ కోహ్లీ.. గత 19 సీజన్లుగా ఆ జట్టులోనే కొనసాగుతున్నాడు. మరే ఆటగాడు కూడా విరాట్ కోహ్లీలా ఒకే ఫ్రాంచైజీకి అత్యధిక సీజన్లు ఆడలేదు. సుదీర్ఘ కాలం ఆర్‌సీబీకి కోహ్లీ సారథ్యం వహించాడు. అతని సారథ్యంలో ఆర్‌సీబీ.. ఐపీఎల్ 2016 ఫైనల్ చేరినా తృటిలో టైటిల్ కోల్పోయింది. రజత్ పాటిదార్ సారథ్యంలో వరుసగా రెండు సీజన్లలో విజేతగా నిలిచింది.
ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై విరాట్ కోహ్లీ అద్భుతమైన హాఫ్ సెంచరీతో సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2026 ఫైనల్లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న తర్వాత విరాట్ కోహ్లీ తన మైండ్ సెట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. మైదానంలోని ప్రతి క్షణాన్ని తాను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తానని, ఒత్తిడి.. తనను మరింత చెలరేగేలా చేస్తుందని చెప్పుకొచ్చాడు.
ఒత్తిడిలో మరింత చెలరేగుతా..
'నేను ఫీల్డింగ్, బ్యాటింగ్ చేసినా.. మైదానంలో నా హృదయాన్ని, ఆత్మను పెట్టి ఆడతాను. ఎందుకంటే ఏదో ఒక రోజు ఇది ముగిసిపోతుంది. నేను మైదానంలో ఉన్న ప్రతి రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, ఎంతో ఆనందించాలని అనుకుంటాను. ఒత్తిడితో కూడిన పరిస్థితుల కోసం, కాస్త సవాలుగా అనిపించే సమయాల కోసం ఎదురుచూస్తాను. అలాంటి సమయంలో నన్ను నేను ఛాలెంజ్ చేసుకుంటూ.. 'ఏదైతే అది అయింది, ముందుకు దూకు' అని చెప్పుకుంటాను.
అలా మనం ఆ లైన్ దాటి విజయం సాధించినప్పుడు, అది మనల్ని ఒక అత్యుత్తమ ప్లేయర్‌గా మారుస్తుంది.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 56.25 సగటుతో 675 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ అతని కంటే ముందున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

