Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: అతనే మా ఓటమిని శాసించాడు: రజత్ పాటిదార్

మిచెల్ మార్ష్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో తమ ఓటమిని శాసించాడని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ అన్నాడు. మిచెల్ మార్ష్‌ను అడ్డుకునే విషయంలో తాను అయోమయానికి గురయ్యానని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ డీఎల్‌ఎస్ పద్దతిన 9 పరుగుల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది.

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రజత్ పాటిదార్.. ఒక రెండు షాట్ల దూరంలో విజయాన్ని చేజార్చుకున్నామని చెప్పాడు. ఈ ఓటమికి స్పష్టమైన కారణం ఇప్పుడే చెప్పడం కష్టమని తెలిపాడు.

ఇప్పుడే చెప్పడం కష్టం..

'లక్ష్యాన్ని ఎలా ఛేదించాలనే విషయంలో మాకు స్పష్టమైన అవగాహన ఉంది. కుర్రాళ్ళు బాగా ఆడారు. మేం ఈ మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్ళిన విధానం బాగుంది. కేవలం ఒకటి రెండు షాట్ల దూరంలో ఆగిపోయాం. ఇది బ్యాటింగ్‌కు చాలా అనుకూలమైన పిచ్. బంతి బ్యాట్ మీదకు చాలా చక్కగా వస్తోంది. మ్యాచ్ ముగిసిన వెంటనే విశ్లేషించడం కష్టం. దీని గురించి ఆలోచించడానికి మాకు కొంత సమయం కావాలి. మాకు ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టి పెడుతూ ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాం.

RCB Captain Rajat Patidar Says Mitchell Marsh s Explosive Century Put Us Under Pressure After 9-Run Loss to LSG
Photo Credit: screen grab for JioHotstar

మిచెల్ మార్ష్ ఆడిన తీరు అద్భుతం. ముఖ్యంగా పవర్‌ప్లేలో అతను మమ్మల్ని చాలా ఒత్తిడిలోకి నెట్టాడు. పవర్‌ప్లే ముగిసిన వెంటనే మార్ష్‌కు ఎవరితో బౌలింగ్ చేయించాలనే విషయంలో నేను కాస్త అయోమయానికి గురయ్యాను. అతను ఆడిన విధానం నిజంగా ఒక అసాధారణమైన ఇన్నింగ్స్. మేం ఆడిన తీరు, మా బ్యాటర్లందరూ చూపించిన తెగువ చాలా బాగుంది. ప్రస్తుతం జట్టులో అందరూ ఆత్మవిశ్వాసంతో మంచి మానసిక స్థితిలో ఉన్నారు.'అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.

శతక్కొట్టిన మిచెల్ మార్ష్..

పదే పదే వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను అంపైర్లు 19 ఓవర్లకు కుదించగా.. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్(56 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్స్‌లతో 111) సెంచరీతో చెలరేగగా.. నికోలస్ పూరన్(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38), రిషభ్ పంత్(10 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హజెల్‌వుడ్, కృనాల్ పాండ్యా, రసిక్ సలామ్ తలో వికెట్ తీసారు. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆర్‌సీబీ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 213 పరుగులుగా నిర్ణయించారు.

అనంతరం ఆర్‌సీబీ నిర్ణీత 19 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులే చేసి ఓటమిపాలైంది. రజత్ పాటిదార్(31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 61), దేవదత్ పడిక్కల్(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34), టీమ్ డేవిడ్(17 బంతుల్లో4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40), కృనాల్ పాండ్యా(28 నాటౌట్), రొమారియో షెపెర్డ్(23) రాణించినా ఫలితం లేకపోయింది. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్(3/33) మూడు వికెట్లు తీయగా.. షెహ్‌‌బాజ్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీకి ఒక వికెట్ దక్కింది.

Story first published: Friday, May 8, 2026, 10:39 [IST]
Other articles published on May 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+