
షార్జా: ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో కోహ్లీసేన ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయమైంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసింది. గ్లేన్ మ్యాక్స్‌వెల్(33 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. దేవదత్ పడిక్కల్(38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), విరాట్ కోహ్లీ(24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25), ఏబీ డివిలియర్స్(18 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 23) రాణించారు. పంజాబ్ బౌలర్లలో మహమ్మద్ షమీ(3/39), మోయిసెస్ హెన్రీక్స్(3/12) మూడేసి వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేసింది. మయాంక్ అగర్వాల్(42 బంతుల్లో 57), కేఎల్ రాహుల్(35 బంతుల్లో 39) రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్(3/29) మూడు వికెట్లు తీయగా.. జార్జ్ గార్టన్, షాబాజ్ అహ్మద్ చెరొక వికెట్ పడగొట్టారు.
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించారు. వీరి దూకుడుకు షాబాజ్ అహ్మద్ బ్రేక్ వేశాడు. కేఎల్ రాహుల్(39)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్(3) మళ్లీ విఫలమయ్యాడు. చాహల్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అయితే మరో ఎండ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మయాంక్ అగర్వాల్.. ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
కానీ చాహల్ మయాంక్‌ను ఔట్ చేసి మరోసారి దెబ్బతీశాడు. ఎయిడెన్ మార్క్‌క్రమ్(20) ఆడపాదడపా బౌండరీలు బాదగా.. సర్ఫరాజ్ ఖాన్ గోల్డెన్ డకౌటయ్యాడు. చహల్ మ్యాజిక్ స్పిన్‌కు బిత్తరపోయాడు. ఇక చివరి ఓవర్‌లో పంజాబ్ విజయానికి 6 బంతుల్లో 19 రన్స్ కావాల్సి ఉండగా.. షారుఖ్ ఖాన్ రనౌటయ్యాడు. ఆ తర్వాత హెన్రీక్స్ సిక్స్ బాదినా ఫలితం లేకపోయింది.