బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ ముందు తమ మహిళా జట్టు కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ల్యూక్ విలియమ్స్‌ను నియమించింది. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం లేకపోయినా ల్యూక్ విలియమ్స్‌కు కోచ్‌గా మంచి రికార్డు ఉంది. ప్రపంచవ్యాప్తంగా అతను అనేక ఫ్రాంచైజీలకు కోచ్‌గా సేవలందించాడు.
ఆస్ట్రేలియా వేదికగా జరిగే మహిళల బిగ్‌బాష్ లీగ్ అడిలైడ్ స్ట్రైకర్స్‌కు నాలుగు సీజన్ల పాటు విలియమ్స్ కోచ్‌గా వ్యవహరించాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగే ది హండ్రెడ్ లీగ్‌లోనూ సదరన్ బ్రేవ్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పని చేశాడు. ఆస్ట్రేలియా జాతీయ మహిళల క్రికెట్ లీగ్‌లో సౌత్ ఆస్ట్రేలియాన్ స్కార్పియన్స్ జట్టుకు కోచ్‌గా సేవలందించాడు.

డబ్ల్యూపీఎల్ అరంగేట్ర సీజన్‌లో స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్‌సీబీ దారుణంగా విఫలమైంది. 8 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే గెలిచింది. ఈ చెత్త ప్రదర్శన నేపథ్యంలో తొలి సీజన్‌లో టీమ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించిన బెన్ సాయర్‌పై ఆర్‌సీబీ వేటు వేసింది. అతని స్థానాన్ని ల్యూక్ విలియమ్స్‌తో భర్తీ చేసింది.
డబ్ల్యూపీఎల్ అరంగేట్ర సీజన్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ మహిళల టీమ్ గెలుచుకున్న విషయం తెలిసిందే. హర్మన్ ప్రీత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ టీమ్ అసాధారణ ప్రదర్శనతో ట్రోఫీని ముద్దాడింది. తొలి సీజన్ పరాజయం నేపథ్యంలో టీమ్ ప్రక్షాళనకు దిగిన ఆర్‌సీబీ.. ముందుగా హెడ్ కోచ్‌పై వేటు వేసింది.
డబ్ల్యూపీఎల్ మినీ వేలానికి ముందు అవసరం లేని ఆటగాళ్లను కూడా వదులుకునే అవకాశం ఉంది. అయితే తమ కొత్త కోచ్ ల్యూక్ విలియమ్స్ నియామకంపై ఆర్‌సీబీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. పురుషుల టీమ్ హెడ్ కోచ్‌ను కూడా ఆర్‌సీబీ మార్చిన విషయం తెలిసిందే. మైక్ హస్సీకి ఉద్వాసన పలికిన ఆర్‌సీబీ.. ఆండీ ఫ్లవర్‌ను తమ కొత్త కోచ్‌గా నియమించుకుంది.