
ముంబై: 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత కామెంట్రీ బాక్స్ ఎక్కడుందా? అని వెతికానని టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు.
అంతకుముందు కామెంటేటర్, టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.. ఓ మ్యాచ్ సందర్భంగా జడేజాను 'బిట్స్ అండ్ పీసెస్' లాంటి క్రికెటర్ అని కామెంట్ చేశాడు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జడేజా సైతం అప్పుడే ట్విటర్‌లో ఓ పోస్టు చేసి తనదైన శైలిలో స్పందించాడు. మంజ్రేకర్.. నీ నోటి విరేచనాలను ఆపంటూ ఘాటుగా బదులిస్తూ నోరు మూయించాడు.
అయితే, తాజాగా ఆ ఘటనపై స్పందించిన జడేజా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'న్యూజిలాండ్‌తో జరిగిన నాటి సెమీఫైనల్లో హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే మైదానంలో ఉన్న కామెంట్రీ బాక్స్ కోసం ఎక్కడుందా అని వెతికాను. అది అక్కడే ఎక్కడో ఉంటుందని భావించాను. ఆ సమయంలో నేను ఎవరికోసం బ్యాట్‌ను తిప్పానో అర్థం చేసుకునే వారికి తెలుస్తుంది.'అని జడేజా చెప్పుకొచ్చాడు.
ఆ మ్యాచ్‌లో జడేజా(59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77) ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగి మ్యాచ్‌ను గెలిపించినంత పనిచేశాడు. ధోనీ( 72 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 50)తో కలిసి ఏడో వికెట్‌కు 116 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న జడేజా వెంటనే తన బ్యాట్‌ను పైకెత్తి కత్తి తిప్పినట్లు తిప్పి సంబరాలు చేసుకున్నాడు.
ఇక ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 239/8 పరుగులు చేసి టీమిండియా ముందు స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, ఛేదనలో భారత టాప్ ఆర్డర్ పేకమేడలా కూలింది. కేఎల్ రాహుల్(1), రోహిత్ శర్మ(1), కెప్టెన్ విరాట్ కోహ్లీ(1) దారుణంగా విఫలమయ్యారు. ఆపై రిషభ్ పంత్(32), దినేశ్ కార్తీక్(6), హార్దిక్ పాండ్య(32) సైతం వికెట్లు కాపాడుకోలేకపోయారు. ఈ క్రమంలోనే టీమిండియా 92 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది.
అనంతరం జడేజా, ధోనీ శతక భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను గెలిపించేలా విశ్వప్రయత్నం చేశారు. జడేజా ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కానీ, చివర్లో అనూహ్యంగా పుంజుకున్న కివీస్ వారిద్దర్నీ ఔట్ చేసి విజయం ఖాయం చేసుకుంది. చివరికి భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.