
ముంబై: విపరీతమైన డ్యూతో పాటు కీలక క్యాచ్‌లను నేలపాలు చేయడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా అన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇది చెన్నైకి వరుసగా రెండో పరాజయం. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై టాస్ ఓడిపోవడం గమనార్హం. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన రవీంద్ర జడేజా తమ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. ఆరంభంలో లక్నో బ్యాటర్లు ఇచ్చిన సునాయస క్యాచ్‌ల నేలపాలు చేయడం తమ ఓటమిని శాసించిందన్నాడు. విపరీతమైన మంచు కారణంగా బంతిపై పట్టు చిక్కలేదని చెప్పాడు. పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందన్నాడు.
'మాకు మంచి ఆరంభం లభించింది. కానీ పేలవ ఫీల్డింగ్ మా అవకాశాలను దెబ్బతీసింది. విజయం సాధించాలంటే క్యాచ్‌లు అందుకోవాలి. ఆ రెండు అవకాశాలను మేం ఒడిసిపట్టుకోవాల్సింది. ఇక మైదానంలో విపరీతమైన డ్యూ ఉంది. దాంతో బంతిపై పట్టు చిక్కలేదు. మేం తడి బంతులతో ప్రాక్టీస్ చేయాలి. మా టాప్-6 బ్యాట్స్‌మెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వికెట్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. బౌలింగ్‌లో మేం మా ప్రణాళికలను అమలు చేయాల్సిన అవసరం ఉంది'అని జడేజా చెప్పుకొచ్చాడు.
లక్నో ఇన్నింగ్స్ ఆరంభంలో 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద డికాక్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను మొయిన్ అలీ వదిలేసాడు. 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేఎల్ రాహుల్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను తుషార్ దేశ్ పాండే అందుకోలేకపోయాడు. ఈ రెండు తప్పిదాలు చెన్నైకి భారీ నష్టం చేశాయి. ఇక 19వ ఓవర్ శివమ్ దూబేకు ఇవ్వడం కూడా చెన్నై పరాజయానికి ప్రధాన కారణమైంది. ఆ ఓవర్‌లో బదోనీ, లూయిస్ దంచికొట్టడంతో 25 పరుగులు వచ్చాయి. జడేజా చెత్త కెప్టెన్సీ కూడా జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. మొయిన్ అలీతో మిడిల్ ఓవర్‌లో బౌలింగ్ చేయించకపోవడం.. ప్రిటోరియస్, బ్రావో ఓవర్లను కాపాడుకోపోవడం జట్టుకు నష్టం చేసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు చేసింది. రాబిన్ ఊతప్ప(27 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 50), శివమ్ దూబే(30 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్‌లతో 49), మొయిన్ అలీ(22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35), అంబటి రాయుడు(20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) రాణించారు. లక్నో బౌలర్లలో ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్‌లకు తలో రెండు వికెట్లు దక్కాయి. అనంతర లక్ష్య చేధనకు దిగిన లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగులు చేసింది. ఎవిన్ లూయిస్(23 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55 నాటౌట్), క్వింటన్ డికాక్(45 బంతుల్లో 9 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. చెన్నై బౌలర్లలో ప్రిటోరియస్ రెండు వికెట్లు తీయగా.. తుషార్, డ్వేన్ బ్రావో తలో వికెట్ పడగొట్టారు.