టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్‌పై సహచర స్పిన్నర్ రవీంద్ర జడేజా స్పందించాడు. రిటైర్మెంట్ ప్రకంటిచిన రోజంతా పక్కనే ఉన్నా ఒక్క హింట్ ఇవ్వలేదని, తన అధికారిక ప్రకటనకు ఐదు నిమిషాల ముందు మాత్రమే చెప్పాడన్నాడు.
ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ అనంతరం అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓటమి తప్పించుకున్న టీమిండియా.. మెల్ బోర్న్ వేదికగా జరిగే నాలుగో టెస్ట్‌కు సిద్దమైంది. డిసెంబర్ 26 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్ నేపథ్యంలో శనివారం జడేజా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అశ్విన్ రిటైర్మెంట్‌పై స్పందించాడు. 'ఆ రోజు మొత్తం అశ్విన్ నాతో ఉన్నాడు. కానీ అతని రిటైర్మెంట్ గురించి నాకు అతని ప్రకటనకు ఐదు నిమిషాల ముందు తెలిసింది. రిటైర్మెంట్ గురించి ఒక్క హింట్ ఇవ్వలేదు. అశ్విన్ మైండ్ ఎలా పనిచేస్తోంది మనందరికి తెలిసిందే.'అని జడేజా నవ్వుతూ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంటామని రవీంద్ర జడేజా ధీమా వ్యక్తం చేశాడు. 'ఓవర్‌సీస్ కండిషన్స్‌లో ఆడుతున్నప్పుడు టాప్ ఆర్డర్ బ్యాటర్లు చేసే పరుగులు చాలా కీలకమైనవి. టాపార్డర్ విఫలమైనప్పుడు లోయర్ ఆర్డర్‌పై బాధ్యత, ఒత్తిడి పెరుగుతుంది. నాలుగో టెస్ట్‌లో టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు రాణిస్తారని ఆశిస్తున్నాం.
ప్రస్తుతం ఈ సిరీస్‌లో 1-1తో మేం మంచి స్థితిలో ఉన్నాం. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా సిరీస్ మా సొంతమవుతుంది. గతంలో రెండు సార్లు మేమే గెలిచాం. ఈ సిరీస్‌లోపై చేయి సాధించడానికి ఈ మ్యాచ్ మాకు మంచి అవకాశం. నాలుగో టెస్ట్‌లో మేం బాగా ఆడాలి. గత మ్యాచ్‌లో మా ఆట తీరు పేలవంగా ఉంది. ఆ తప్పిదాలను సరిచేసుకునే ప్రయత్నం చేస్తాం. మా ఫోకస్ అంతా మెల్ బోర్న్ టెస్ట్ పైనే ఉంది.'అని రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు.