న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్ తొలి రోజు ఆటలో పూర్తి ఆధిపత్యం చెలాయించిన తాము చివరి 15 నిమిషాల్లో మాత్రం తేలిపోయామని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు. అనూహ్య రీతిలో వికెట్లు కోల్పోయి వెనుకంజలో నిలిచామని చెప్పాడు. సరైన కమ్యూనికేషన్ లేకపోవడంతో పాటు మిస్‌జడ్జ్‌మెంట్ తమకు తీరని నష్టం చేశాయన్నాడు.
ముంబై వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా(5/65) అసాధారణ బౌలింగ్‌తో కివీస్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా వాషింగ్టన్ సుందర్(4/81) నాలుగు వికెట్లు తీయగా.. ఆకాశ్‌దీప్ ఓ వికెట్ తీసాడు. జడేజాకు ఇది 14వ టెస్ట్ 5 వికెట్ హాల్.

ఈ ప్రదర్శనతో అతను పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్‌లను 311 వికెట్ల టెస్టు రికార్డును అధిగమించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లలో 4 వికెట్లకు 86 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ(18), యశస్వి జైస్వాల్(30), నైట్ వాచ్ మ్యాన్ మహమ్మద్ సిరాజ్(0), విరాట్ కోహ్లీ(4) దారుణంగా విఫలమయ్యారు. క్రీజులో శుభ్‌మన్ గిల్(38 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31 బ్యాటింగ్)తో పాటు రిషభ్ పంత్( 1 బ్యాటింగ్) ఉన్నాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆజాజ్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టాడు. తొలి రోజు ఆట చివర్లో 8 బంతులు 6 పరుగుల వ్యవధిలో టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది.
మ్యాచ్ అనంతరం తన ఐదు వికెట్ల ప్రదర్శనపై మాట్లాడిన రవీంద్ర జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'భారత గడ్డపై టెస్ట్‌ల్లో ఐదు వికెట్లు తీయడం ఎప్పడూ ప్రత్యేకమే. నా ప్రదర్శనతో జట్టుకు ఉపయోగపడినందుకు సంతోషంగా ఉంది. ఇక్కడున్న వేడిలో బౌలింగ్ చేయడం అంత సులువు కాదు. వాషింగ్టన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. జట్టులోని ప్రతీ ఒక్కరు తమ పాత్రలను పోషించారు.
బ్యాటింగ్ యూనిట్‌గా మేం సమష్టి ప్రదర్శన చేయాల్సి ఉంది. జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మలను అధిగమించాననే విషయం నాకు తెలియదు. నేను మ్యాచ్ ఆడనప్పుడే రికార్డులను పరిశీలిస్తా. టికెట్లు తీస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ వికెట్‌పై మిక్స్‌డ్ పేస్‌తో బౌలింగ్ చేయాలి. మరీ నెమ్మదిగా బౌలింగ్ చేస్తే ఫలితం రాదు. వికెట్‌పై బౌన్స్ ఉంది. కానీ పేస్ లేదు. భుజాలను ఉపయోగించి బౌన్స్ రాబట్టాలి.
చివరి 15 నిమిషాల్లో మా ఆట అనూహ్యం. సరైన కమ్యూనికేషన్ లేకపోవడం.. సరిగ్గా అంచనా వేయకపోవడంతో అలా జరిగింది. మేం ఇంకా 150 పరుగుల వెనుకంజలో ఉన్నాం. చిన్న చిన్న భాగస్వామ్యాలు నమోదు చేసి జట్టు స్కోర్‌ను 230కి చేర్చడం మా గేమ్ ప్లాన్.'అని జడేజా చెప్పుకొచ్చాడు.