Ravindra Jadeja: ధోనీ ఉండగా.. టెన్షన్ ఎందుకు దండగా!


ముంబై: పది జట్లతో వస్తున్న ఐపీఎల్ 2022 సీజన్ కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్న వేళ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి తన ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ ప్రేమికులందరికీ షాకిచ్చాడు. టీమ్‌లో తనకెంతో నమ్మకస్తుడైన రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే గురువారం అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ సీజన్‌తో పాటు భవిష్యత్తులో కూడా ధోనీ తమ ఫ్రాంచైజీతో ఉంటాడని స్పష్టం చేసింది. ఇన్నాళ్లు ధోనీ సేనగా ముద్రపడ్డ సీఎస్‌కే ఇప్పుడు జడేజా సేనగా మారింది.

ధోనీ భయ్యా ఉండగా..
సీఎస్‌కే సారథ్య బాధ్యతలు అందుకోవడంపై జడేజా సంతోషం వ్యక్తం చేశాడు. అయితే తాను ఓ పెద్ద వ్యక్తి స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉందన్నాడు. కెప్టెన్‌గా మహీ భాయ్ ఇప్పటికే ఘన వారసత్వాన్ని ఏర్పాటు చేశాడని, తాను దాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తానన్నాడు. అయితే ధోనీ టీమ్‌తోనే ఉన్నాడు కాబట్టి తనకు ఎలాంటి ఆందోళన లేదన్నాడు. ఏ అవసరం వచ్చి ధోనీ భాయ్ దగ్గరకే వెళ్తానని చెప్పాడు. జడేజా మాట్లాడిన ఓ వీడియోను సీఎస్‌కే ట్విటర్ వేదికగా పంచుకుంది. ఆ వీడియోకు ‘మా కొత్త కెప్టెన్ ఫస్ట్ రియాక్షన్ ఇదేనంటూ'క్యాప్షన్‌గా పేర్కొంది.

ధోనీ సలహాలతోనే..
‘సీఎస్‌కేకు కెప్టెన్ అవడం సంతోషంగా ఉన్నప్పటికీ నేను ఓ పెద్ద వ్యక్తి స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది. కెప్టెన్‌గా మహీ భాయ్ ఇప్పటికే ఘన వారసత్వాన్ని ఏర్పాటు చేశాడు. కెప్టెన్‌గా దానిని నేను విజయవంతగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ దీని గురించి నేను అంతగా ఆందోళన చెందడంలేదు. ధోనీ భయ్యా కెప్టెన్సీ బాధ్యతలు మాత్రమే వదులుకున్నాడు. ఆటగాడిగా జట్టులోనే ఉంటాడు. జట్టులో పెద్దన్న పాత్ర పోషించే ధోనీ సలహాలను నేను ఉపయోగించుకుంటా. మీ ప్రేమకు, అభిమానికి కృతజ్ఞతలు. మీ మద్దతు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా' ఆ వీడియోలో జడేజా చెప్పుకొచ్చాడు.

జడేజా సరైనోడు..
రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ పూర్తిగా కొత్త. 34 ఏళ్ల జడేజా సీనియర్ లెవల్‌లో ఇప్పటి దాకా ఏ జట్టుకు నాయకత్వం వహించలేదు. 2007లో భారత్ అండర్ 19 టీమ్‌కు మాత్రం కెప్టెన్‌గా పని చేశాడు. కానీ, ఐపీఎల్‌తో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తనకు చాలా అనుభవం ఉంది. అలాగే, అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతమైన ఆల్‌రౌండర్‌గా తను పేరు తెచ్చుకున్నాడు. కెప్టెన్సీ అనుభవం లేకపోయినా.. ఆటను తను బాగా అర్థం చేసుకోగలడు. గ్రౌండ్‌లో ప్రశాంతంగా ఉండగలడు. పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్, బౌలింగ్ చేయగలడు. అన్నింటికి మించి ఇంకా నేర్చుకోవాలని, మెరుగవ్వాలనే తపన జడేజాకు అతిపెద్ద బలం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications