
న్యూఢిల్లీ: ఆటలో భాగంగా క్రికెటర్లు గాయపడటం సర్వసాధారణం. రిస్కీ క్యాచ్‌ల కోసం డైవ్ చేస్తూనో.. బౌలింగ్, బ్యాటింగ్ చేసే సమయంలోనూ గాయపడుతుంటారు. ఆసియాకప్ 2022 బరిలోకి దిగిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సైతం గాయంతో జట్టు మొత్తానికి దూరమయ్యాడు. అయితే జడేజా మ్యాచ్‌లో ఇలా రిస్కీ ఫీట్స్ చేసినట్లు ఎక్కడా కనిపించలేదు. హంగ్ కాంగ్‌తో చివరి సారిగా ఆడిన జడేజా బ్యాటింగ్ చేయకున్నా.. బౌలింగ్, సూపర్ ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. పాకిస్థాన్‌తో సూపర్ 4 మ్యాచ్‌కు ముందు అతను మొకాలి గాయంతో జట్టుకు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది.
దాంతో అతని పాత గాయం మళ్లీ తిరగబెట్టిందోనని అంతా భావించారు. కానీ క్రికెట్‌కు సంబంధం లేని ఆట ద్వారా గాయపడినట్లు ఆలస్యంగా వెలుగు చూసింది. ఆటగాళ్ల రిలాక్స్ కోసం నిర్వహించే ఫన్నీ గేమ్స్, టాస్క్‌ల్లో భాగంగా జడేజా గాయపడ్డాడు. పాకిస్థాన్‌తో సూపర్ 4 మ్యాచ్‌కు ముందు టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్వహించిన అడ్వెంచర్ యాక్టివిటీస్‌లో భాగంగా దుబాయ్ సముద్ర తీరంలో స్కై బోర్డుపై విన్యాసాలు చేయబోయిన జడేజా ప్రమాదవశాత్తు జారిపడి గాయపడ్డాడు. ఈ వ్యవహారంపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహంగా ఉంది. జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను వివరణ కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి.

జడేజా మోకాలికి శస్త్ర చికిత్స చేశారు. అయితే అతడు కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉంది. దాంతో అతడు టి20 ప్రపంచకప్ మొత్తానికి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జడేజా ఆసియా కప్ కు దూరం కావడంతో.. ఆ తర్వాతి రెండు గేముల్లోనూ భారత్ ఓడిపోయింది. చివరి మ్యాచ్ లో అఫ్గాన్ పై గెలిచి ఉపశమనం పొందింది.
అయితే ఇలా ఆటలతో సంబంధం లేకుండా భారత క్రికెటర్లు గాయపడటం ఇదే తొలిసారి కాదు. గతంలో యువరాజ్ సింగ్ ఇలానే కీలక టోర్నీ ముందు గాయపడ్డాడు. 16 ఏళ్ల క్రితం 2006లో భారత్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఆ టోర్నీ మధ్యలో స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఖో ఖో అడుతూ మోకాలి గాయం బారిన పడ్డాడు. దాంతో అతడు ఐదు నెలల పాటు క్రికెట్ కు దూరం కావాల్సి వచ్చింది. చాంపియన్స్ ట్రోఫీలో యువరాజ్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. నాకౌట్ దశకు చేరకుండానే భారత్ టోర్నీ నుంచి తప్పుకుంది.