
ముంబై: టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరించడంలో ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ చేసిన ఓ ట్వీట్‌కు అతను ఇచ్చిన సమాధానం ఆకట్టుకుంటుంది. 2025లో మీ దృష్టిలో ఉత్తమ ఆటగాడిగా ఎవరుంటారో చెప్పాలంటూ రాజస్తాన్ రాయల్స్ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులను అడుగుతూ ఒక ఫొటోను షేర్ చేసింది. దీనిపై జడేజా తనదైన రీతిలో బదులిచ్చాడు. '2025లోనా .. ఇంకెవరు నేనే ఉత్తమ ఆటగాడిగా ఉంటా.. అందులో ఎలాంటి డౌట్ లేదు'అంటూ సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అయింది.

జడేజా ప్రస్తుత తరంలో ఉత్తమ ఆల్‌రౌండర్ల జాబితాలో ఒకడిగా ఉన్నాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో తమ పోస్టుపై జడేజా పెట్టిన కామెంట్‌కు సంతృప్తి చెందిన రాజస్తాన్ రాయల్స్..'మాకు సమాధానం దొరికింది.. ఇది ఇక్కడితో ముగిద్దాం'' అంటూ కామెంట్ చేసింది. ఇక ఆసీస్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడ్డ జడేజా జట్టుకు దూరమయ్యాడు. మూడో టెస్ట్‌లో అతను బ్యాటింగ్ చేస్తుండగా.. మిచెల్ స్టార్క్ వేసిన బంతి అతని బొటనవేలికి తాకి తీవ్ర గాయమైంది. వైద్యులు అతన్ని పరీక్షించగా.. ఆరు వారాల విశ్రాంతి అవసరం కావడంతో ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టుతో పాటు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.
అంతేగాక శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న 5 టీ20ల సిరీస్‌కు జడేజా అందుబాటులో ఉండటం లేదు. ఆ తర్వాత జరిగే మూడు వన్డేల సిరీస్ మాత్రం ఆడే అవకాశం ఉన్నట్లు టీమిండియా మేనేజ్‌మెంట్ తెలిపింది. కాగా జడేజా తన ప్రాక్టీస్‌కు సంబందించిన వీడియోనూ తన ట్విటర్‌లో షేర్ చేశాడు. నా ప్రాక్టీస్ మొదలుపెట్టా.. కచ్చితంగా జట్టులోకి వస్తా అంటూ కామెంట్ చేశాడు. ఇక ఏప్రిల్ 9 నుంచి జరగనున్న ఐపీఎల్ 14వ సీజన్‌కు మాత్రం జడేజా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాడు. టీమిండియా తరపున ఇప్పటి వరకు జడేజా 51 టెస్టుల్లో 1954 పరుగులు.. 220 వికెట్లు, 168 వన్డేల్లో 2411 పరుగులు.. 187 వికెట్లు, 50 టీ20ల్లో 217 పరుగులు.. 39 వికెట్లు సాధించాడు. జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ సైతం అదరగొట్టాడు.