
దుమ్మురేపిన జడేజా..
లోయర్ ఆర్డర్‌లో విధ్వంసకరంగా ఆడుతూ జట్టుకు భారీ స్కోర్లు అందిస్తున్నాడు. జట్టులో కీలక సభ్యుడిగా మారిపోయాడు. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడినా.. నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు సమాయత్తం అవుతున్నాడు. ఈ పర్యటన కోసం బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉన్న జడేజా.. తాజాగా ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

తప్పుడు షాట్లు..
'2015 ప్రపంచకప్ సందర్భంగా ఏ బంతులు వదిలేయాలో అవే ఆడేందుకు ప్రయత్నిస్తున్నాని ధోనీ చెప్పినట్లు నాకు గుర్తుంది. నా షాట్ల ఎంపిక తప్పుగా ఉందని నాకు కూడా అనిపించేది. షాట్ ఆడే విషయంలో నా అంచనా సరిగ్గా ఉండేది కాదు. డబుల్ మైండ్‌సెట్‌తో ఉండేవాడిని. ఆడలా? వద్దా? అన్నట్టు ఆలోచించేవాడిని. కానీ ఇప్పుడు కావాల్సిన సమయం తీసుకుంటున్నాను. స్పష్టంగా ఆలోచిస్తున్నాను. ముందు నిలదొక్కుకుంటే తర్వాత పరుగులు చేయవచ్చని తెలుసుకున్నాను.

షార్ట్ పిచ్ బంతుల్ని..
ఆలోచనా విధానంలో ఆ మార్పు నాకిప్పుడు సాయపడుతోంది. షార్ట్‌పిచ్ బంతుల్ని సిక్సర్లుగా మలిస్తే ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతుంది. బౌన్సర్లతో నాకెప్పుడూ ఇబ్బంది అనిపించలేదు. ఎక్కువసార్లు ఔటైనట్టూ కూడా గుర్తులేదు. ఆడలేననీ నాకూ అనిపించలేదు. నా షాట్ల ఎంపిక ముఖ్యమని అర్థమైంది' అని జడేజా చెప్పుకొచ్చాడు. అయితే ఈ మార్పుకు ధోనీ ఇచ్చిన సలహానే కారణమని జడేజా స్పష్టం చేశాడు. కావాల్సిన సమయం తీసుకొని ఆడితే పరుగులు అవే వస్తాయన్నాడని గుర్తు చేసుకున్నాడు.

ఎన్నో నిద్రలేని రాత్రులు..
2018కి ముందు ఏడాదిన్నర పాటు నిద్రలేని రాత్రులు గడిపా. ఆ సమయంలో రోజూ తెల్లవారుజాము దాదాపు 5 గంటల వరకు మెలకువతోనే ఉండేవాడిని. ఏం చేయాలి. మళ్లీ ఎలా పుంజుకోవాలనే విషయాలపైనే ఆలోచించేవాడిని. దాంతో నిద్ర పట్టేది కాదు. అప్పుడు టెస్టు జట్టులో కొనసాగుతున్నా.. తుది జట్టులో మాత్రం అవకాశం దక్కేది కాదు.
వన్డేల్లో చోటు కోల్పోయా. టీమిండియాతో కొనసాగడం వల్ల దేశవాళీ క్రికెట్‌లోనూ ఆడలేకపోయా. నన్ను నేను నిరూపించుకునేందుకు అవకాశం వచ్చేదికాదు. ఎలా ముందుకు సాగాలో అనేదానిపై తీవ్రంగా ఆలోచించేవాడిని. కానీ, 2018లో ఆడిన ఓవల్ టెస్టే మొత్తం మార్చేసింది. అది నా ఆటను, నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ' అని జడేజా చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












