టెస్ట్ క్రికెట్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత జడేజా పేరు కెప్టెన్సీ, వైస్-కెప్టెన్సీ రేసులో పెద్దగా వినిపించలేదు. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు టీమిండియా టెస్ట్ సారథ్య బాధ్యతలు దక్కాయి. జడేజా కూడా తనకు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చెపట్టే అవకాశాలు లేవని అంగీకరించాడు.దాంతో సీనియర్ ఆటగాడిగా జట్టులో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో జడేజా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 137 బంతుల్లో 89 పరుగులు చేసి తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి 6వ వికెట్‌కు 203 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దాంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు భారీ స్కోర్ చేసింది.
రెండో రోజు ఆట అనంతరం జడేజా మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్సీ చేయాలనే కోరిక ఉందా? అని విలేకరులు ప్రశ్నించగా.. 'ఆ అవకాశం ఇప్పుడు లేదు'అని జడేజా నవ్వుతూ బదులిచ్చాడు.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌పై జడేజా ప్రశంసల జల్లు కురిపించాడు. 'నిజాయితీగా చెప్పాలంటే.. శుభ్‌మన్ గిల్ ఆత్మవిశ్వాసం అద్భుతం. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతను అసలు కెప్టెన్‌గా కనిపించలేదు. అదనపు బాధ్యతలను సమర్థవంతంగా మోస్తున్నాడు. ఈ రోజు దురదృష్టవశాత్తు ఔటయ్యాడు తప్పా.. ఈ ఇన్నింగ్స్‌లో అతను ఔట్ అవుతాడని నాకు అనిపించలేదు. చాలా బాగా ఆడాడు. మేము బ్యాటింగ్ చేసేటప్పుడు భాగస్వామ్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేదానిపై చర్చించుకున్నాం.’అని జడేజా చెప్పుకొచ్చాడు.
గిల్‌తో కలిసి జడేజా 203 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ భారీ స్కోరు వైపు దూసుకెళ్లింది. అయితే, జోష్ టంగ్ వేసిన షార్ట్-పిచ్ బంతిని పుల్ చేయబోయి జడేజా ఔటయ్యాడు. ఆ తర్వాత గిల్ (269) వాషింగ్టన్ సుందర్ (42)తో కలిసి 144 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ 587 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 20 ఓవర్లలో 3 వికెట్లకు 77 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్.. తమ బజ్‌బాల్ గేమ్‌ను పక్కన పెట్టి జిడ్డు బ్యాటింగ్‌తో అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్ ఆడింది. బెన్ డకెట్ (0), ఆలీ పోప్ (0), జాక్ క్రాలీ (19) విఫలమవ్వగా.. హ్యారీ బ్రూక్(30 బ్యాటింగ్), జోరూట్(18 బ్యాటింగ్) ఆచితూచి ఆడి ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు.
మూడో రోజు ప్రణాళిక గురించి జడేజా మాట్లాడుతూ, "మేము ఎక్కువగా ఆలోచించడం లేదు. మూడో రోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి 2-3 వికెట్లు తీయాలి. అలా చేస్తే, మేము కచ్చితంగా ఆటలో ముందుంటాము. పెద్ద భాగస్వామ్యాలు నమోదైనా.. ఆటను తేలికగా తీసుకోము. ఈ రోజు ఉత్సాహంగా ఆడాము. అదే జోరును కొనసాగించే ప్రయత్నం చేస్తాం. అనుకూల ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం.’అని జడేజా చెప్పుకొచ్చాడు.