
అబుదాబి: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో దుమ్మురేపుతున్నాడు. పవర్ ఫుల్ బ్యాటింగ్‌తో పవర్ హిట్టర్ పాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరి ఓవర్ అంటే చాలు శివాలెత్తిపోతున్నాడు. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఫస్ట్ టైమ్ లోయరార్డర్‌లో మెరుపులు మెరిపించిన జడేజా.. అప్పటి నుంచి బ్యాటింగ్‌లో అదే జోరును కొనసాగిస్తున్నాడు. మధ్యలో గాయాలతో సతమతమైనా.. మళ్లీ గాడినపడ్డాడు.
భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్ లీగ్‌లోనూ మెరుపులు మెరిపించిన జడేజా.. సెకండాఫ్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 15 బంతుల్లో 4 ఫోర్లు ఓ సిక్స్‌తో 32 రన్స్ బాదాడు. అయితే జడేజా ఆఖరి ఓవర్‌లో ధాటిగా ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆఖరి ఓవర్‌లో 19 బంతులు ఆడిన జడేజా.. 336.84 స్ట్రైక్‌రేట్‌తో 64 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, ఏడు సిక్స్‌లు ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ గణంకాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్(60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగడంతో రాజస్థాన్ రాయల్స్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. గైక్వాడ్ సూపర్ సెంచరీతో రాణించగా.. రవీంద్ర జడేజా(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తెవాటియా మూడు వికెట్లు తీయగా.. సకారియా ఓ వికెట్ పడగొట్టాడు. ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్‌కు 100 మీటర్ల సిక్స్ బాదిన రుతురాజ్.. కెరీర్‌లో ఫస్ట్ ఐపీఎల్ సెంచరీ నమోదు చేశాడు. ఈ సీజన్‌లో ఇది నాలుగో సెంచరీ కావడం గమనార్హం. రుతురాజ్ కన్నా ముందు సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్ శతకాలు బాదారు.
ఇక 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలుపెట్టింది. యువ ఓపెనర్ యశ్వసి జైస్వాల్(21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) మెరుపు హాఫ్ సెంచరీ బాదగా.. ఎవిన్ లూయిస్(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) ధాటిగా ఆడాడు. ఈ జోడీ ఫస్ట్ వికెట్‌కు ఏకంగా 77 పరుగులు జోడించింది. భీకరంగా మారిన ఈ జోడీని శార్దూల్ ఠాకూర్ విడదీసాడు. ఎవిన్ లూయిస్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం ఆసిఫ్.. యశస్వీని ఔట్ చేయగా.. క్రీజులోకి వచ్చిన శాంసన్, శివమ్ ధాటిగా ఆడుతున్నారు.