IND vs SL: ముగిసిన రెండో రోజు ఆట.. పట్టుబిగించిన టీమిండియా! కష్టాల్లో శ్రీలంక

మొహాలీ: రవీంద్ర జడేజా ( 228 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 175 నాటౌట్) భారీ శతకంతో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. ముందుగా బ్యాటింగ్‌లో దుమ్మురేపి కొండంత స్కోర్‌ను లంక ముందు ఉంచిన రోహిత్ సేన.. ఆ తర్వాత బంతితో రఫ్ఫాడించింది. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు మాత్రమే చేసింది. భారత్ కన్నా ఆ జట్టు ఇంకా 466 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. సెంచరీ హీరో జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా చెరొక వికెట్ పడగొట్టారు. అంతకు ముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 574/8 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది.
రవీంద్ర జడేజా అజేయ శతకానికి తోడు రవిచంద్రన్ అశ్విన్(82 బంతుల్లో 8 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు 130 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించగా.. మహమ్మద్ షమీ(20 నాటౌట్)తో కలిసి జడేజా 9వ వికెట్‌కు 103 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. డబుల్ సెంచరీ దిశగా జడేజా దూసుకెళ్లగా.. టీమిండియా డిక్లేర్ నిర్ణయం అతన్ని ఆ ఘనతను అందుకోకుండా చేసింది.

జడేజా సెంచరీ..
357/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ అదే జోరును కొనసాగించింది. ఆట ఆరంభంలోనే ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.., రవిచంద్రన్ అశ్విన్ అతనికి అండగా నిలిచాడు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఈ జోడీ క్లాసీ షాట్స్‌తో అలరించింది. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ 67 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని లక్మల్ విడదీసాడు. అశ్విన్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి జయంత్ యాదవ్ రాగా.. ఎంబుల్దేనియా బౌలింగ్‌లో క్విక్ సింగిల్ తీసి జడేజా కెరీర్‌లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తనదైన బ్యాట్ సాము సెలెబ్రేషన్స్‌తో షేన్ వార్న్‌కు నివాళులర్పించాడు. జడేజా సెంచరీతో టీమిండియా 468/7 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

షమీతో శతక భాగస్వామ్యం..
బ్రేక్ అనంతరం జయంత్ యాదవ్(2) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా త్వరగానే ఆలౌటవుతుందని అంతా భావించారు. కానీ క్రీజులోకి వచ్చిన మహమ్మద్ షమీతో కలిసి జడేజా అద్భుతంగా ఆడాడు. సూపర్ షాట్లతో లంక బౌలర్లను చెడుగుడు ఆడాడు. ఎక్కువగా తానే స్ట్రైకింగ్ తీసుకుంటూ జట్టు స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. అతనికి షమీ కూడా స్ట్రైక్ రొటేట్ చేస్తూ సహకరించాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యం సెంచరీ ధాటడం.. రెండో సెషన్‌కు టైమ్ దగ్గరపడటంతో టీమ్‌మేనేజ్‌మెంట్ డిక్లేర్ ఇచ్చింది. దాంతో డబుల్ సెంచరీకి జడేజా 25 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.

కష్టాల్లో శ్రీలంక..
ఇక చివరి సెషన్‌లో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు ఆదిలోనే గట్టి షాకిచ్చారు. ఆచితూచి ఆడుతున్న ఓపెనర్ లాహిరు తిరిమన్నేను అశ్విన్ వికెట్ల ముందు బోల్తా కొట్టించగా.. ఆ కొద్దిసేపటికే మరో ఓపెనర్, కెప్టెన్ దిముత్ కరుణరత్నే(28)ను జడేజా ఔట్ చేశాడు. దాంతో శ్రీలంక 59 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన ఏంజెమో మాథ్యూస్(22), పాతమ్ నిస్సంక(26 బ్యాటింగ్) నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని జస్‌ప్రీత్ బుమ్రా విడదీసాడు. సీనియర్ బ్యాటర్ మాథ్యూస్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ధనుంజయ డిసిల్వాను అశ్విన్ ఎల్బీగా వెనక్కిపంపడంతో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications