
లక్నో: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప'బాక్సాఫిస్ వద్ద కనెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి ఆదరణ లభించింది. ఎంతలా అంటే ప్రతీ ఒక్కరు పుష్ప మానియాలో మునిగి తేలారు. స్టార్ క్రికెటర్లు సైతం పుష్ప మెనరిజాన్నీ అనుకరించారు. పుష్ప సినిమా వచ్చి మూడు నెలలు అవుతున్నా ఇంకా ఆ మూవీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా శ్రీలంకతో గురువారం జరిగిన తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజా.. మరోసారి పుష్ప ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్స్‌తో అభిమానులను అలరించాడు.
ఇన్నింగ్స్ చివర్లో అప్‌ది ఆర్డర్‌లో బ్యాటింగ్ వచ్చిన జడేజాకు రఫ్ఫాడించేందుకు పెద్దగా అవకాశం రాలేదు. కానీ బౌలింగ్‌లో జడ్డూ తన మార్క్‌ను చూపించాడు. 4 ఓవర్లు వేసిన జడేజా 28 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. 10 పరుగులు చేసిన వికెట్ కీపర్ చండిమల్‌ను ఔట్ చేసిన జడేజా 'అల్లుఅర్జున్ 'పుష్ప''ను అనుకరించాడు. ఇషాన్ కిషన్ స్టంప్ ఔట్ చేయగానే.. జడేజా తన చేతితో గడ్డాన్ని నిమురుతూ తగ్గేదే లే(మై జూకేకా నహీ) అన్నాడు. జడేజా ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్స్‌ను చూసి రోహిత్ నవ్వు ఆపుకోలేకపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీస్కోరు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' ఇషాన్ కిషన్ (56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 89) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57 నాటౌట్), రోహిత్ శర్మ (32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 44) మెరుపులు మెరిపించారు. అనంతరం శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చరిత్ అసలంక (47 బంతుల్లో 5 ఫోర్లతో 53 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్, వెంకటేశ్ అయ్యర్ రెండేసి వికెట్లు తీయగా.. జడేజా, చాహల్ చెరొక వికెట్ పడగొట్టారు.