టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను అందుకున్నాడు. విదేశాల్లో ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన 6వ భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజ క్రికెటర్, సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ 23 ఏళ్ల రికార్డ్‌ను అధిగమించాడు. 2002లో వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో వీవీఎస్ లక్ష్మణ్ 474 పరుగులు చేశాడు. భారత్ తరఫున 6వ స్థానం లేదా అంత కంటే దిగువ స్థానంలో బ్యాటింగ్ వచ్చి లక్ష్మణ్ ఈ రికార్డ్ నెలకొల్పాడు.
గత 23 ఏళ్లుగా ఈ రికార్డ్ చెక్కు చెదరకుండా ఉంది. తాజా ఇంగ్లండ్ పర్యటనలో రవీంద్ర జడేజా ఈ రికార్డ్‌ను అధిగమించాడు. ఈ సిరీస్‌లో 6వ స్థానంలో బ్యాటింగ్ చేసిన జడేజా.. 10 ఇన్నింగ్స్‌ల్లో 5 అర్థ సెంచరీలు, ఒక సెంచరీతో 500* పరుగులు చేశాడు. తద్వారా మరో ఘనతను అందుకున్నాడు. ఈ టెస్ట్ సిరీస్‌లో 500 ప్లస్ పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు.

కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ మాత్రమే ఈ సిరీస్‌లో 500 ప్లస్ రన్స్ చేశారు. ఒక టెస్ట్ సిరీస్‌లో 500 ప్లస్ రన్స్ చేసిన నాలుగో ఆల్‌రౌండర్‌గా జడేజా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో గ్యారీ సోబెర్స్, ఇయాన్ బోతమ్, జాక్వస్ కల్లీస్‌లు రవీంద్ర జడేజా కంటే ముందు ఈ ఫీట్ సాధించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సచిన్ టెండూల్కర్ కూడా తన కెరీర్‌లోనే ఒక టెస్ట్ సిరీస్‌లో 500 ప్లస్ రన్స్ చేయలేదు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఓవర్ నైట్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్(164 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 118) సెంచరీతో చెలరేగగా.. ఆకాష్ దీప్(94 బంతుల్లో 12 ఫోర్లతో 66) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. శుభ్‌మన్ గిల్(11), కరుణ్ నాయర్(17), ధ్రువ్ జురెల్(34) నిరాశపర్చినా.. వాషింగ్టన్ సుందర్(11 బ్యాటింగ్)తో కలిసి రవీంద్ర జడేజా(51 బ్యాటింగ్) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ఇప్పటికే భారత్ ఆధిక్యం 322 పరుగులకు చేరుకుంది. 400 ప్లస్ లక్ష్యాన్ని నమోదు చేస్తే ఈ మ్యాచ్‌పై భారత్ పట్టు బిగించనుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటవ్వగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులు చేసింది.