Ravindra Jadeja ఖాతాలో మరో రికార్డు! గత 60 ఏళ్లలో ఒకే ఒక్కడు!

మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆల్‌రౌండ్ షోతో దుమ్మురేపుతున్న టీమిండియా స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ముందుగా బ్యాటింగ్‌లో భారీ శతకంతో చెలరేగిన జడేజా(228 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్సర్లతో 175 నాటౌట్).. ఆ తర్వాత బంతితో రఫ్ఫాడించాడు. సూపర్ బౌలింగ్‌తో (5/41) ఐదు వికెట్ల ఘనతను అందుకొని శ్రీలంక పతనాన్ని శాసించాడు. తద్వారా ఒక టెస్ట్ మ్యాచ్‌లో 150 ప్లస్ రన్స్, ఐదు వికెట్లు తీసిన ఆరో ప్లేయర్‌గా.. మూడో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

మూడో భారత ఆటగాడిగా..
ఇంతకుముందు టీమిండియా తరపున వినూ మాన్కడ్ 1952లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో బ్యాటింగ్‌లో 184 పరుగులు.. బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీశాడు. 1962లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో మరో భారత ఆల్‌రౌండర్ పాలి ఉమ్రిగర్ 172 పరుగులతో అజేయంగా నిలిచి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. తాజాగా ఈ జాబితాలో జడేజా చేరాడు. పాలి ఉమ్రిగర్ తర్వాత గత 60 ఏళ్లలో మరో భారత ఆటగాడు ఈ ఘనతను అందుకోలేకపోయాడు. ఇక ఓవరాల్‌గా ఈ లిస్ట్‌ను పరిశీలిస్తే.. జడేజా కన్నా ముందు వినూ మన్కడ్, డెనిస్ అట్‌కిన్సన్, పాలి ఉమ్రిగర్, గ్యారీ సోబర్స్, ముస్తాక్ మహ్మద్ ఉన్నారు.

10వ ఫిఫ్ఫర్..
జడేజా చివరిసారిగా 2017లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. అప్పుడు ప్రత్యర్థి శ్రీలంకనే కావడం విశేషం. కొలంబో వేదికగా జరిగిన ఆ టెస్టులో జడేజా 152 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. తాజాగా మరోసారి శ్రీలంకపై ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించాడు. జడేజాకు టెస్టుల్లో ఇది పదో ఫిఫ్ఫర్. ఇక టెస్టులో టీమిండియా శ్రీలంకపై తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించడం పదోసారి కావడం విశేషం.

విజయం దిశగా భారత్...
మ్యాచ్ విషయానికి వస్తే.. 108/4 ఓవర్ నైట్‌స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన శ్రీలంక 65 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో పాతుమ్ నిస్సంక(133 బంతుల్లో 11 ఫోర్లతో 61 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. చివరి నలుగురు బ్యాట్స్‌మన్ అయితే డకౌటవ్వడం విశేషం.
జడేజా ఐదు వికెట్ల ప్రదర్శనకు తోడు రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు తీశారు. షమీకి ఓ వికెట్ దక్కింది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 574/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. దాంతో టీమిండియాకు 400 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఈ నేపథ్యంలో శ్రీలంక ఫాలో ఆన్ ఆడుతుంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ అశ్విన్ ధాటికి 45 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications