ఆస్ట్రేలియా పర్యటనకు ముందు టీమిండియా మేనేజ్‌మెంట్‌కు మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక సలహా ఇచ్చాడు. కెరీర్ చివరి దశలో ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు సరైన గౌరవం ఇవ్వాలని సూచించాడు. టెస్ట్, టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ, రోహిత్.. వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు.
ఈ ఇద్దరూ వన్డే ప్రపంచకప్ 2027 ఆడే లక్ష్యంతో ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలోని మూడు వన్డేల సిరీస్‌కు ఈ ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు ఎంపికయ్యారు. అయితే ఈ ఇద్దరూ వన్డే ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగలేరనే సందేహంలో టీమిండియా మేనేజ్‌మెంట్ ఉంది. దాంతో వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించింది. తద్వారా మెరుగైన ప్రదర్శన చేస్తేనే జట్టులో కొనసాగుతారనే హెచ్చరికను జారీ చేసింది.

తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. కోహ్లీ, రోహిత్‌తోనైనా సరిగ్గా వ్యవహరించాలని సూచించాడు. హర్షిత్ రాణా ఎంపికపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నాణానికి ఒకవైపు సెలెక్షన్ కమిటీ.. మరోవైపు కోహ్లీ, రోహిత్ ఉన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్‌ను తప్పించినట్లు అర్థమవుతుంది. అయితే ఈ ఇద్దరూ ఆటగాళ్లు కెరీర్ చివరి దశలో ఉన్నారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒక్కటే.
కనీసం ఈ ఇద్దరి విషయంలోనైనా మెరుగైన రీతిలో వ్యవహరించాలి. అభిమానులు కోరుకునేది కూడా ఇదే. మేనేజ్‌మెంట్ మాత్రం వారు త్వరగా వీడ్కోలు చెప్పాలని కోరుకుంటుంది. ఎందుకంటే కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనేది వారి ఉద్దేశం. ఇలాంటప్పుడే సీనియర్లతో సరైన కమ్యూనికేషన్ ఉండాలి. మీరు భారత్ ఏ తరఫున ఆడితేనే వరల్డ్ కప్ జట్టులో చోటు ఇస్తామని సమాచారం ఇవ్వండి. దేశవాళీలోనూ ఆడాలని చెప్పండి.
హర్షిత్ రాణా గురించి సోషల్ మీడియాలో బాగానే చర్చే జరుగుతోంది. అతని ఎంపిక గురించి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే అతన్ని ఎవరూ ట్రోల్ చేయవద్దు. ఆస్ట్రేలియా గడ్డపై బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన బౌలర్ కావాలి. హర్షిత్ రాణా బ్యాటింగ్ చేస్తాడా? అని ప్రశ్నించవచ్చు. కానీ అతను బ్యాటింగ్ చేయగలడు. 8వ స్థానంలో పరుగులు చేసే సత్తా అతనికి ఉంది. టీమ్‌మేనేజ్‌మెంట్ కూడా అదే నమ్మకంతో ఉంది. అతని బౌలింగ్‌పై సందేహాలు వ్యక్తం చేయడం సరికాదు. అతను జట్టులో అర్హుడా? కాదా? అనేది మరో విషయం. రాణించగలడా? లేదా? అనేది కూడా ఇప్పుడేం చెప్పలేం. కాబట్టి అతనిపై బ్యాడ్ కామెంట్స్ చేయకూడదు.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
ఈ వ్యాఖ్యలతో టీమ్‌మేనేజ్‌మెంట్ తనతో సరిగ్గా వ్యవహరించలేదనే విషయాన్ని అశ్విన్ పరోక్షంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీరుకు విసుగు చెందే అశ్విన్ వీడ్కోలు పలికాడనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. తాజాగా అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఆ వాదనకు బలం చేకూరుస్తోంది.