పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజామ్‌పై టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. మెరుపు తీగలా వచ్చి వెళ్లిపోయాడని సెటైర్స్ వేసాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 114 పరుగులకు ఆలౌటైంది. హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా తొలి రెండు ఓవర్లలోనే పాకిస్థాన్ సైమ్ అయూబ్, సాహిబ్‌జా ఫర్హాన్, సల్మాన్ అలీ అఘా ఔటవ్వడంతో పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఈ పరిస్థితుల్లో జట్టును ఆదుకునే బాధ్యత బాబర్ ఆజంపై పడింది. కానీ 31 ఏళ్ల బాబర్ ఆజామ్ తీవ్రంగా నిరాశపర్చాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ వేసిన ఐదో ఓవర్‌లో స్వీప్ షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
దాంతో కేవలం ఏడు బంతుల్లో ఐదు పరుగులు మాత్రమే చేసి బాబర్ త్వరగానే పెవిలియన్ చేరాడు. బాబర్ ఆజామ్ ఔటైన తీరుపై రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. పాపులర్ కామెంటేటర్, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన వ్యాఖ్యనంలో తరుచూ చెప్పే "Gone like a tracer bullet" అనే డైలాగ్‌తో బాబర్ ఆజామ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

బాబర్ ఆజం నిష్క్రమణపై అభిమానులు కూడా తమదైన శైలిలో స్పందించారు. తెలుగు సినిమా సింహరాశిలోని ఫేమస్ డైలాగ్ అయిన 'మెరుపు తీగ వచ్చి పోమ్మా’ అనే వ్యాఖ్యతో సెటైర్లు పేలుస్తున్నారు. బాలీవుడ్ చిత్రం 'దురందర్'లో భారత ఏజెంట్ పాకిస్థాన్‌ను నాశనం చేసినట్లుగా బాబర్ తన జట్టును నాశనం చేశాడని మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేశారు.
బాబర్ ఔటైన తర్వాత పాకిస్థాన్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. ఉస్మాన్ ఖాన్(44) పోరాడినా ఫలితం లేకపోయింది. అతనికి ఇతర బ్యాటర్ల నుంచి మద్దతు లభించలేదు. దాంతో పాకిస్థాన్ 18 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించారు. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ కేవలం 40 బంతుల్లో 77 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్‌ను ఆడాడు. దాంతో అతనికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.