టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతనిది అసూయపడే బ్యాట్ స్వింగ్ అని కొనియాడాడు. అభిషేక్ శర్మ గాలిగాడంటూ పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలకు అశ్విన్ తనదైన శైలిలో కౌంటరిచ్చాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ.. జింబాబ్వేతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 72 పరుగులతో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. అభిషేక్ శర్మను కొనియాడుతూ... మహమ్మద్ అమీర్‌కు కౌంటరిచ్చాడు. 'అభిషేక్ శర్మను 'స్లాగర్'(బంతిని విచక్షణారహితంగా బాదే వ్యక్తి) అని పిలుస్తూ మహమ్మద్ అమీర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా.. మీరు అభిషేక్ ఆట గురించి ఏదైనా చెప్పండి. కానీ అతను మాత్రం స్లాగర్ కాదు. ప్రస్తుత క్రికెట్‌లో ఎవరైనా అసూయపడేంత గొప్ప బ్యాట్ స్వింగ్ అతని సొంతం. యువరాజ్ సింగ్ అతని మెంటార్ అని మనందరికీ తెలుసు.

అభిషేక్ బ్యాట్ స్వింగ్ యువరాజ్ కంటే మెరుగ్గా ఉంటుంది. అంతకంటే మంచి బ్యాట్ స్వింగ్‌ను మనం ఊహించలేం. అభిషేక్ బంతిని బాదినప్పుడల్లా అది చాలా దూరం వెళ్తుంది. అందుకే ప్రజలు అతన్ని పొరపాటున స్లాగర్ అనుకోవచ్చు. అభిషేక్ చేస్తున్న ఒకే ఒక్క తప్పు ఏంటంటే .. ప్రతి బంతిని ఎదుర్కోవడంలో అతిగా దూకుడు ప్రదర్శించడం.'అని అశ్విన్ పేర్కొన్నాడు.
అభిషేక్ శర్మ తన బ్యాట్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కొనియాడాడు. అతని డిఫెన్సివ్ షాట్ చూసి ఆశ్చర్యపోయానని తెలిపాడు. 'బ్యాటర్‌గా అభిషేక్ శర్మ ఎంత ప్రతిభావంతుడో మనకు తెలుసు. జింబాబ్వేపై అతను చేసిన 55 పరుగుల ఇన్నింగ్స్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను నిలదొక్కుకోవడానికి కొంత అదనపు సమయం తీసుకున్నాడు.
అతని బ్యాటింగ్‌లో ఒక పద్ధతి కనిపించింది. ఆఫ్ స్పిన్నర్‌కు గౌరవం ఇచ్చాడు. అనవసరమైన రిస్క్ తీసుకోకుండా చాలా ప్రశాంతంగా, సంయమనంతో ఆడాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో అతను ఒక డిఫెన్సివ్ షాట్ ఆడాడు. బంతిని డిఫెండ్ చేశాడు. సాధారణంగా అభిషేక్ అలా చేయడం మనం చూడం. కాబట్టి అది చూసి నేను కాస్త ఆశ్చర్యపోయాను. అని గవాస్కర్ జోడించారు.