న్యూఢిల్లీ: ఒకప్పుడు టీమిండియాలో అందరూ స్నేహితులే ఉండేవారని, ఇప్పుడు ఒక్కడు కూడా లేడని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. కాలం మారడంతో స్నేహితుల్లా ఉండే ఆటగాళ్లు, సహచరుల్లా మాత్రమే ఉంటున్నారని తెలిపాడు. ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో తుది జట్టులో చోటు దక్కించుకోకపోయిన అశ్విన్.. తాను బ్యాట్స్‌మన్ అయితే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్న అశ్విన్.. మారిన కాలంతో క్రికెట్‌లో వచ్చిన మార్పుల గురించి చెప్పుకొచ్చాడు. 'గతంలో జట్టులోని ఆటగాళ్లంతా స్నేహితుల్లా ఉండేవారు. ఇప్పుడందరూ కొలిగ్స్‌లానే ఉంటున్నారు. ఇప్పుడు అందరి ధ్యాస ముందుకెళ్లడం మీదే ఉంది. పక్కన ఉన్న వారి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏంటి విశేషాలు.. ఏం చేస్తున్నారని అడిగే తీరిక కూడా ఎవరికీ ఉండటం లేదు.

ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకునే కొద్దీ ఆట మెరుగుపడుతుందనేది నా అభిప్రాయం. ఇతరుల టెక్నిక్‌ను అర్థం చేసుకున్నప్పుడేమన ఆట కూడా మెరుగవుతుంది. కానీ ఇప్పుడు ఎవరూ కూడా అలా చేయడం లేదు. ఎవరూ కూడా సాయం కోసం రావడం లేదు. ఇప్పుడంతా వారి ప్రయాణం వారిదే.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
మంచి బ్యాటర్ అయిన తాను సచిన్ టెండూల్కర్ ఆటను చూసి బౌలర్‌గా మారనని అశ్విన్ తెలిపాడు. శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచ్‌లో భారత బౌలర్లు తీవ్రంగా తడబడ్డారని, ఆ మ్యాచ్‌లో సచిన్ చేసిన పరుగులన్నిటీని భారత బౌలర్లు ఇచ్చేసారని అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. అప్పుడే తాను బౌలర్ అవ్వాలనుకున్నానని తెలిపాడు. అయితే రిటైర్ అయ్యేటప్పుడు ఈ నిర్ణయం తనను బాధించే అవకాశం ఉందన్నాడు.
మంచి బ్యాటర్ అయ్యుండి కూడా బౌలర్‌గా ఎందుకు మారానా? అనే ప్రశ్న జీవితాంతం వెంటాడుతుందన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో అశ్విన్ కాదని ఎక్స్‌ట్రా పేసర్‌తో బరిలోకి దిగిన టీమిండియా మూల్యం చెల్లించుకుంది. అశ్విన్‌ను ఆడించకపోవడంపై సచిన్ టెండూల్కర్‌తో పాటు సునీల్ గవాస్కర్ తదితర మాజీ ఆటగాళ్లు ఘాటుగా స్పందించారు.